వ్రాసినది: శ్రీవాసుకి | మార్చి 1, 2011

మహాశివరాత్రి పర్వదినం పట్టిసీమ రండి..

        బ్లాగ్ మిత్రులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.

క్రితం సంవత్సరం శివరాత్రికి పట్టిసీమ వెళ్ళాను కాని ఈ సంవత్సరం సెలవు కుదరకపోవడం వలన వెళ్ళలేకపోతున్నాను. గత సంవత్సరం పట్టిసీమ వెళ్ళి వచ్చాకా శివ శివా ఏల ఈగోల అని ఒక టపా వ్రాసాను. అది నేను బ్లాగింగ్ క్రొత్తగా మొదలుపెట్టిన రోజులు. పట్టిసీమ శివరాత్రి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. గోదావరి మధ్యలో కొండపై కొలువున్న వీరభద్రస్వామికి ఆరోజు నయనానందకరంగా అభిషేకాలు జరుగుతాయి. 2 సంవత్సరాల క్రితం పట్టిసీమ వెళ్ళినప్పుడు లింగోద్భవ సమయంలో స్వామి సన్నిధానంలోనే ఉన్నాను. ఆలయం లోపల ప్రశాంతంగా ఖాళీగా ఉంది. జనమంతా కొండ క్రింద గోదావరి ఇసుక తిప్పలపై జరుగుతున్న తీర్థంలో హడావిడిగా ఉన్నారు. అందువల్ల స్వామి అభిషేక దర్శనం ప్రశాంతంగా జరిగింది మాకు. రాత్రి 12గంటలు దాటిన కూడా కిక్కిరిసిన జనంతో తీర్థం జరిగే ప్రదేశమంతా గోదావరి తల్లి చల్లని గాలుల నడుమ భలే సరదాగా సందడిగా ఉంటుంది.

రాత్రిపూట శివరాత్రి ఉత్సవాలు చూడటం బాగానే ఉంటుందిగాని లాంచీ మీద ఆలయానికి చేరుకోవడం తలకు మించిన పనే. త్రాగుబోతు జనాలు వచ్చి క్యూలో ఉన్నవారిని త్రోయడం, పోలీసులు జనాన్ని చెదరగొట్టడానికి తరమడం చికాకు తెప్పిస్తుంది. మధ్యాహ్న సమయానికల్లా ఆలయ ప్రాంతానికి వెళ్ళిపోవడం ఉత్తమం. అలా వెళ్ళి రాత్రి వరకు అక్కడ తీర్థంలో తిరిగి శివ దర్శనం చేసుకొని రావొచ్చు. శివరాత్రి నాటి ఉదయం నుంచి రెండు రేవుల మధ్య పగలు, రాత్రి లాంచీలు ఎడతెరిపి లేకుండా తిరుగుతూనే ఉంటాయి. పట్టిసీమ రావడానికి పోలవరం మండలం, కొవ్వూరు మండలం, తాళ్ళపూడి మండలం, రాజమండ్రి మరియు కోనసీమ వంటి ఇతర ప్రాంతాల నుంచి కూడా బస్ సౌకర్యం ఆ మర్నాటి రోజు వరకు ఉంది. అవకాశం ఉన్నవారు ఆటోలలో, కారులలో కూడా వస్తారు. అందుచేత ప్రయాణపరమైన ఇబ్బందులు ఏమి ఉండవు. ప్రసిద్ధమైన పాపికొండల ప్రయాణం కూడా ఈ పట్టిసీమ నుంచే ప్రారంభం అవుతుంది.

శివరాత్రినాటి ఉదయం నుంచి వివిధ సంఘాల వారు రెండు రోజులపాటు ఉచిత భోజనం, ఫలహారం పెడతారు. అవన్నీ కూడా ఆలయ సమీపంలో గోదావరి ఒడ్డున ఉంటాయి. రాత్రి 12 గంటల వరకు భోజనానికి ఇబ్బంది ఉండదు. అందమైన తూర్పుకనుమల (కొండలు) మధ్య ప్రవహించే గోదావరి ఆ నది మధ్యలో దేవకూటంపై వెలిసిన భద్రకాళీ సమేత వీరభద్రుడు, నిరంతరం చల్లగా సేద తీర్చే గోదావరి గాలులు, దేదీప్యమైన విద్యుత్కాంతుల నడుమ అశేష జన సందోహ కోలాహాలం ఇదే మహాశివరాత్రి నాటి పట్టసాచల (పట్టిసీమ) వైభవం.

వ్రాసినది: శ్రీవాసుకి | మార్చి 1, 2011

నా బ్లాగ్ గురించి-2010 in review

2010 సంవత్సరంలో బ్లాగ్ లోకంలోకి అడుగుపెట్టిన నేను ఇప్పటి వరకు వ్రాసినవి 40 పోస్ట్లు మాత్రమే. అలాగే మీ అందరి అభిమానంతో 7,000 హిట్లు వచ్చాయి. నా వరకు ఇవి గొప్పే. నేను వ్రాసేది తక్కువ. అలా అయినా 40 పోస్ట్లు వ్రాయగలగడం చాలా ఆనందంగా ఉంది. వర్డ్ ప్రెస్ నుంచి నా బ్లాగ్ మీద అందిన తాజా గణంకాలు ఇవి. మీతో సరదాగా పంచుకొందామని ఇక్కడ ఇస్తున్నాను.

The stats helper monkeys at WordPress.com mulled over how this blog did in 2010, and here’s a high level summary of its overall blog health:

Healthy blog!

The Blog-Health-o-Meter™ reads Wow.

Crunchy numbers

Featured image

A helper monkey made this abstract painting, inspired by your stats.

A Boeing 747-400 passenger jet can hold 416 passengers. This blog was viewed about 7,000 times in 2010. That’s about 17 full 747s.

In 2010, there were 40 new posts, not bad for the first year! There were 22 pictures uploaded, taking up a total of 4mb. That’s about 2 pictures per month.

The busiest day of the year was June 11th with 319 views. The most popular post that day was నీకు, కుక్కకి తేడా ఏమిటి !!.

Where did they come from?

The top referring sites in 2010 were koodali.org, jalleda.com, maalika.org, WordPress Dashboard, and te.wordpress.com.

Some visitors came searching, mostly for స్నేహం, చాణక్య, గోదావరి, శ్రీ కృష్ణదేవరాయలు వారి, and గోదావరి నది.

Attractions in 2010

These are the posts and pages that got the most views in 2010.

1

నీకు, కుక్కకి తేడా ఏమిటి !! June 2010
26 comments

2

హమ్మయ్య నేను సినిమా చూశాను…. May 2010
23 comments

3

నాకెందుకు ఈ మొహమాటం..!! April 2010
19 comments

4

“ఆయన” తెచ్చిన తంటా ..! March 2010
12 comments

5

నా గురించి January 2010
12 comments

వ్రాసినది: శ్రీవాసుకి | ఫిబ్రవరి 27, 2011

నెటిజన్ల ‘ఈ’పోరు -మన బ్లాగర్ల కోసం..

ఇది ఆంధ్రభూమి దిన పత్రిక ఆదివారం అనుబంధం నుండి సేకరించినది. మన బ్లాగర్ల కోసం..

ఇది అసలైన వ్యాసం యొక్క ఆంధ్రభూమి లింక్

http://www.andhrabhoomi.net/aadivavram-andhrabhoomi/cover-story-493

నెటిజన్ల ‘ఈ’పోరు

 ఆధునిక సమాచార సాంకేతిక విప్లవం… వేలి కొసల చివరనే విశ్వవిజ్ఞానం… ఇది ఈ శతాబ్దంలో మానవుడు సాధించిన మహోన్నత విజయం. క్షణాల్లో ప్రపంచపు నలుమూలలకూ సమాచార బదిలీ.. ఇంటర్నెట్, ఇ-మెయిల్, ఎలక్ట్రానిక్ గ్రూపులు, వ్యక్తిగత బ్లాగులు, వెబ్‌సైట్‌లు, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లు… సమాచారాన్ని పంచుకొనేందుకు ఎన్నో అద్భుత మార్గాలు. ప్రజలకు మరింత చేరువైన వినోదం, విజ్ఞానం. ఇది ఇక్కడితో ఆగిపోలేదు. సమాచార విప్లవాన్ని తోడుగా చేసుకొని సమాజంలోని అవినీతి, అక్రమాలు, సామాజిక దురాచారాలపై యుద్ధ్భేరిని ప్రకటించారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో దేశాల పౌరులు. తాడిత, పీడిత జనం జీవితాల్లో వెలుగులు నింపేందుకు, ఒక మార్పును తెచ్చేందుకు పోరాడుతున్నారు.

ఒక సమస్య గురించి ప్రజాభిప్రాయాన్ని కూడగట్టుకోవాలంటే గతంలో ఎన్నో అడ్డంకులు ఉండేవి. ఆయా సమస్యల గురించి పనిచేస్తున్న నిపుణులు, బాధితులు, సంబంధిత అధికార వర్గాలకు ముందుగా సమాచారాన్ని తపాలా ద్వారా పంపాలి. వారినుంచి వచ్చిన ప్రతిస్పందనలను ఒకచోట చేర్చి, విశే్లషించి మళ్లీ అధికారులకు, రాజకీయ నాయకులకు, మంత్రులకు అందజేయాలి. ఎంతో సమయమూ, ఖర్చుతో కూడుకున్న పని ఇది. ఈ ప్రక్రియలన్నిటిలో ‘సమాచార వ్యాప్తి’ కీలకమైన సమస్యగా ఉండేది. ఇపుడు ఇది సమస్యేకాదు. ఇంటర్నెట్‌లో సమాచారాన్ని ఉంచి ఒక చిన్న పిలుపు ఇస్తే చాలు. ప్రపంచం నలుమూలలనుంచి ఏకధాటిగా నిరంతర ప్రవాహంగా వచ్చి పడుతున్నాయి ప్రతిస్పందనలు. ఎనె్నన్నో ఆలోచనలు, భావనలు, సమస్య మూలాలపై విశే్లషణలు, చర్చలు. మనం ఒంటరిగా లేం- మనకు ఆసరాగా ప్రపంచమే ఉందనే ఒక భరోసా లభిస్తోంది. నాలుగు గోడల మధ్యన ఒంటరిగా కూర్చొని ప్రపంచాన్ని మార్చగలమనే విశ్వాసాన్ని మనలో కలిగిస్తోంది ఈ సమాచార విప్లవం.

ఎంపీ ఖర్చు ఎంత?

ఒక అయిదు సంవత్సరాలు మనకు సేవచేసేందుకు అంటూ పార్లమెంటుకో, అసెంబ్లీకో ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులపై మనం పెడుతున్న ఖర్చు ఎంత? ఒక్కొక్కరికి జీత భత్యాల నిమిత్తం ఎంత అందుతోంది? స్థానిక ప్రాంతాల అభివృద్ధి పేరిట వారికి ఇస్తున్న నిధులను వారెలా ఖర్చుపెడుతున్నారు- ఎవరికోసం ఖర్చు పెడుతున్నారు? ఎన్నికలలో ఒక్కసారి గెలిచినా ఆ నాయకుడు, ఆ కారణంగా తన జీవిత కాలంలో ‘అధికారికంగా’ ఎంత మొత్తంలో ప్రజా ధనాన్ని స్వంతం చేసుకొంటాడు? వీటి గురించి సామాన్యుడు ఆలోచించటం, ఆరాతీయటం సాధారణంగా జరగదు.

యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన ‘మై సొసైటీ’ అనే సంస్థ 2009లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఒక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజా నిధుల వినియోగంలో పారదర్శకతను పాటించవలసిందిగా కోరుతూ పార్లమెంటు సభ్యులకు ఇ-మెయిల్స్ పంపవలసిందిగా యుకె ఓటర్లను కోరింది ఈ సంస్థ. తమ వెబ్‌సైట్‌ను సందర్శించే పాఠకులకు వేలాది అలర్ట్‌లను ఈ సంస్థ పంపేది. ఆ అలర్ట్‌లో సంస్థ వెబ్‌సైట్‌కు లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా వెబ్‌సైట్‌ని సందర్శించి, తమ ప్రాంత పార్లమెంటు సభ్యుడు ఎవరు? వాళ్ల ఇ-మెయిల్ ఏమిటి? వంటి వివరాలను పాఠకులు తెలుసుకోవటంతోపాటు, ప్రజానిధుల వినియోగంలో పారదర్శకతను పాటించవలసిందిగా కోరుతూ లేఖ ఎలా వ్రాయాలో కూడా తెలుసుకొనే అవకాశం ఉంటుంది. ఈ వెబ్‌సైట్ నుంచే నేరుగా తమ ఎంపీకి వాళ్లు లేఖను వ్రాయవచ్చు. ఎంపీకి మెయిల్ పంపిన పాఠకులు ఈ లక్ష్యంతో ఏర్పాటుచేసిన ఫేస్‌బుక్ గ్రూపులో సభ్యులు అవుతారు. దాంతో వారి ఫేస్‌బుక్ ప్రొఫైల్ ద్వారా, వారి మిత్రులకూ ఈ సమాచారం అందుతుంది. సమాచార స్వేచ్ఛ ఎంతగానో ఉన్నప్పటికీ, అప్పట్లో ప్రభుత్వం ఎంపీల ఖర్చుల క్లెయిమ్‌లను వెల్లడించేది కాదు. ఈ పరిస్థితిలో మార్పును తెచ్చేందుకు ‘మై సొసైటీ’ చేపట్టిన ప్రచార కార్యక్రమం ద్వారా దాదాపు 95 శాతం మంది పార్లమెంటు సభ్యులకు వారి ఓటర్లనుంచి వేలాది సంఖ్యలో మెయిల్స్ వెళ్లాయి. ఫలితంగా ఎంపీల ఖర్చుల వివరాలను బహిరంగం చేసేందుకు యుకె ప్రభుత్వం అంగీకరించింది.

ఈ ప్రచార కార్యక్రమం కోసం ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌తో తయారైన కాంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను సంస్థ ఉపయోగించుకొంది. ఈ ప్రచార కార్యక్రమం గురించి మీడియాలో వార్తలు వెలువడిన నెలలో ఈ వెబ్‌సైట్‌ను అయిదు లక్షల మంది పాఠకులు సందర్శించారు. ప్రస్తుతం రెండున్నర లక్షల మంది పాఠకులు ప్రతినెలా సంస్థ వెబ్‌సైట్‌ను సందర్శించటం జరుగుతోంది. ఈ ఒక్క ప్రచార కార్యక్రమంకోసం సంస్థ ఖర్చుపెట్టిన మొత్తం కేవలం 1700 యుఎస్ డాలర్లు మాత్రమే!

పోలీసు లంచావతారం!

మీ మొబైల్‌లో కెమేరా సదుపాయం ఉందా? ఇంటర్నెట్ మీకు అందుబాటులో ఉందా? మరింకేం మీదగ్గర ఒక శక్తివంతమైన ఆయుధం ఉన్నట్లే. అదెలా అంటారా? ఈ క్రింది కథనం చదవండి మరి.

ట్రాఫిక్ పోలీసులు మోటారు వాహనదారులనుంచి ‘లంచం’తీసుకోవటం కేవలం మన రాష్ట్రానికో, దేశానికో పరిమితం అనుకోకూడదు. ఇది ఎన్నో దేశాల్లో ఉన్నదే. ఇందుకు మొరాకో కూడా అతీతం కాదు. పోలీసు అధికారులు లంచాలతో వేధించటం చూసిన ఒకరు ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలనుకొన్నారు. మోటారిస్టుల నుంచి పోలీసు అధికారులు లంచాలు తీసుకొంటున్న దృశ్యాలను ఆయన వీడియో తీశారు. రిఫ్ పర్వత ప్రాంతాల సమీపంలో ఉన్న టర్గూయిస్ట్ గ్రామ శివార్లలో ప్రతిరోజూ పోలీసులు నిలిచివుండి మోటారిస్ట్‌లనుంచి లంచాలు తీసుకొనే దృశ్యాలను చిత్రీకరించారు. అలా తీసిన మొదటి వీడియోను ‘యూ ట్యూబ్’లో 8 జూలై 2007వ తేదీన ఉంచాడు. అలా జూలై, ఆగస్ట్ నెలల మధ్యకాలంలో నాలుగు వీడియోలను వెబ్‌సైట్‌లో ఉంచారు. అతి తక్కువ కాలంలోనే వేలాది మంది ఈ వీడియోలను వీక్షించారు. గ్రామ శివార్లలో వాహనదారులను ఆపి ఇద్దరు పోలీసులు చేతులు చాపటం, డబ్బు తీసుకోవటం ఈ వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. వీడియోలో మరే ఇతర కామెంటరీ లేదు. ‘ఈ లంచాలు తీవ్రవాదాన్నీ, డ్రగ్ డీలర్లనూ ప్రోత్సహిస్తాయనే’ సందేశం తెరపై ఫ్లాష్ అవుతుంది. మొరాకోలో పోలీసుల లంచాలతో విసిగిపోయిన ప్రజలమధ్య ఆసక్తికరమైన చర్చకు ఈ వీడియోలు కారణమయ్యాయి. ఈ మొత్తం శ్రమ వృధాగా పోలేదు. ప్రభుత్వం ఈ అధికారుల మీద చర్యలు తీసుకోవటంతోపాటు, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు వీడియో కెమెరాలతో పోలీసుల చర్యలను పర్యవేక్షించటం మొదలుపెట్టింది. సివిల్ డ్రస్‌లలో ప్రత్యేకంగా పోలీసులను వీడియో స్నిపర్ టీమ్‌ల పేరిట నియమించి, ఇదే తరహాలో పోలీసుల లంచగొండితనాన్ని చిత్రీకరించటం మొదలుపెట్టింది ప్రభుత్వం. లంచాలను తీసుకొంటున్న తొమ్మిది మంది పోలీసు అధికారులను అదుపులోకి తీసుకోవటంతోపాటు మరికొందరిని బదిలీ చేసింది.

వీడియోలను తీసి ఇంటర్నెట్‌లో పెట్టిన ఆ వ్యక్తి మీడియాకు ఎన్నో ఇంటర్వ్యూలను ఇచ్చినప్పటికీ, తాను మాత్రం తన పేరును వెల్లడిచేయకుండా ‘టర్గూయిస్ట్ స్నిపర్’ పేరిట అజ్ఞాతంగానే ఉండిపోయి ఆధునిక ‘రాబిన్‌హుడ్’గా నిలిచిపోయాడు. యూట్యూబ్ గణాంకాల ప్రకారం అతి తక్కువకాలంలోనే నాలుగు లక్షల మంది ఈ వీడియోలను వీక్షించటం జరిగింది. అది ఇంకా పెరుగుతూనే ఉంది. ఈ వీడియోలు ఇచ్చిన స్ఫూర్తితో యువతరంకూడా తమ కెమేరాలకు పనిపెట్టారు. సిటిజన్ జర్నలిస్ట్‌లుగా మారిపోయారు. హషిష్ స్మగ్లర్‌నుంచి పోలీసు అధికారి ఒకరు లంచం తీసుకొనే దృశ్యాలతో కూడిన వీడియోను మరొక మొరాకో పౌరుడు యూట్యూబ్‌లో ఉంచారు. మొరాకోలోని బీచ్‌లో వ్యాపారం చేసుకొనే వ్యక్తిని పోలీసులు కొడుతున్న దృశ్యాన్ని ఇంటర్నెట్‌కు ఎక్కించాడు మరొక యువకుడు.

‘‘రోడ్ల పక్కన రోజంతా నిలబడి, చిల్లరకోసం కక్కుర్తిపడే చిన్నస్థాయి ఉద్యోగులనే మనం ఈ వీడియోల్లో చూస్తున్నాం. దేశాన్ని కొల్లగొడుతున్న పెద్ద దొంగలను ఈ వీడియోల్లో పెట్టాలి’’ అంటూ ఒకరు యూ ట్యూబ్‌లో కామెంట్ చేయటం నేటి పరిస్థితులకు అద్దం పడుతోంది.

భూమి హక్కులకోసం…

మన దేశంలో సిటిజన్ జర్నలిస్ట్‌లను తయారుచేసేందుకు పాటుపడుతున్న సంస్థలలో వీడియో వాలంటీర్స్ ఒకటి. ఈ సంస్థ సహాయంతో భూమి హక్కులపై గుజరాత్‌కు చెందిన గ్రామస్థులు స్వయంగా ఒక వీడియో తీశారు. ఈ వీడియోని చుట్టుపక్కల ఉన్న 25గ్రామాలలో ప్రదర్శించారు. దీంతో భూమిని సముచితంగా పంపిణీ చేయాలంటూ 700 మంది ప్రజలు ర్యాలీగా వెళ్లి, స్థానిక ప్రభుత్వాలకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులను చేశారు. ఇందుకోసం వారు ఉపయోగించింది డిజిటల్ వీడియో కెమెరా. వీడియోలను ప్రదర్శించేందుకు వీసీడీలు, ప్రొజెక్టర్లు మాత్రమే.

కాషాయ విప్లవం

బర్మాలో మిలటరీ సెన్సార్‌షిప్‌కు వ్యతిరేకంగా బ్లాగర్లు ఉద్యమించారు. మానవ హక్కుల ఉల్లంఘనను ఇంటర్నెట్ సాయంతో ప్రపంచానికి వెల్లడించారు. ఇంధనం సబ్సిడీలను అర్థాంతరంగా తొలగించినప్పుడు చెలరేగిన ప్రజానిరసనను, నిరసన ఫలితంగా ప్రజలపై పెరిగిన మిలటరీ హింసకు సంబంధించిన ఫొటోలను డిజిటల్ కెమెరాలు, మొబైల్ కెమేరాలను ఉపయోగించి తీశారు. కాషాయం దుస్తుల్లోఉన్న బౌద్ధ సన్యాసులు నిరసన వ్యక్తంచేస్తూ రోడ్లపైకి వచ్చిన దృశ్యాల ఫొటోలు, వీడియోలను బ్లాగుల సహాయంతో ఆన్‌లైన్‌లో పెట్టారు. దీంతో బర్మాలో ఏం జరుగుతోందో ప్రపంచానికి వెల్లడయింది. ఈ మొత్తం ప్రచార కార్యక్రమంలో కార్యకర్తలు ఉపయోగించింది బ్లాగులు, డిజిటల్ కెమెరాలు, మొబైల్ ఫోన్‌లు మాత్రమే! అయితే ఇక్కడ బ్లాగర్లు కొంత రిస్క్‌ను కూడా తీసుకొన్నారనే చెప్పవచ్చు. ఫొటోలను, వీడియోలను అప్‌లోడ్ చేసిన కంప్యూటర్‌ల ఐపి అడ్రస్‌లు, ఇ-మెయిల్ అకౌంట్లు, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో ఉన్న వారి మిత్రుల జాబితాలను ఎవరైనా తెలుసుకోవటం సులభమే. అలాగే మొబైల్ ఫోన్‌ల నుంచి ఫొటోలను వెబ్‌సైట్‌లకు పంపటమూ జరిగింది. ఈ ఫోన్‌ల సిమ్‌కార్డులు, ఆ సిమ్‌కార్డులను ఎవరు కొనుగోలు చేశారనే దాని ఆధారంగా వారి ఐడెంటినీ ప్రభుత్వం తెలుసుకోవచ్చు. బ్లాగర్లకు సాంకేతికంగా ఈ విషయాలు తెలిసినా కూడా నిర్భయంగా ముందుకువచ్చి సెన్సార్‌షిప్‌ను వ్యతిరేకించారు. వాస్తవాలను వెల్లడించారు.

చెప్పిందొకటి, చేసిందొకటి!

వేశ్యా వృత్తిలో ఉన్న వారిని పట్టుకొని, వారికి పునరావాసం కల్పించటం, గౌరవప్రదమైన వృత్తిలో నిలదొక్కుకొనేలా చేసేందుకు ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలను అమలుచేయటం మనకు తెలిసిన విషయమే. కానీ వాస్తవంగా ఈ పథకాల అమలు ఏవిధంగా జరుగుతోంది? సెక్స్‌వర్కర్‌లకు సంబంధించిన ఆసియా పసిఫిక్ నెట్‌వర్క్ సభ్యులు డిజిటల్ వీడియో సాయంతో ఈ వృత్తిలోని మహిళలు ఎదుర్కొంటున్న అవమానాలను, అమానవీయ సంఘటనలను వెలుగులోకి తీసుకువచ్చారు. కాంబోడియాలో సెక్స్ వర్కర్లను తీసుకువెళ్లి పునరావాస కేంద్రాల్లో ఉంచారు. వారికి ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన వృత్తి విద్యా నైపుణ్యాలను అక్కడ నేర్పుతున్నారని స్థానిక మీడియా వార్తాకథనాలను ప్రచురించింది. రాజకీయ నాయకులూ పదే పదే అదే చెప్పారు. అక్కడి పరిస్థితులను పరిశీలించిన ఉమెన్స్ నెట్‌వర్క్ ఫర్ యూనిటీ అనే సంస్థ సభ్యులకు మాత్రం వాస్తవమేమిటో అర్ధమైంది. ఆ పునరావాస కేంద్రాలలో మహిళలపై లైంగిక దోపిడీ కొనసాగుతూనే ఉంది. కేంద్రాల నిర్వహణతో సంబంధంఉన్న వ్యక్తులనుంచి వత్తిళ్లు, బెదిరింపులు పెరిగాయి. మామూలుగా ఒప్పుకోకపోతే బలాత్కారాలూ జరుగుతున్నాయి. కాదన్నవారికి ఆహారమూ, నీళ్లూ, ఔషధాలు ఇవ్వకుండా వేధిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లోఉన్న కొందరు మహిళలు బహిరంగంగా ఈ వాస్తవాలను వెల్లడించేందుకు అంగీకరించటంతో, నెట్‌వర్క్ సభ్యులు వారిని డిజిటల్ కెమేరాలను ఉపయోగించి ఇంటర్వ్యూ చేశారు. ఈ వీడియోలను యూ ట్యూబ్, బ్లిప్ టీవీలలో ఉంచారు. స్థానిక మానవ హక్కుల సంఘాలు పునరావాస కేంద్రాలలో జరిగిన హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన సాక్ష్యాలను బహిర్గతం చేసేందుకు ముందుకు వచ్చాయి. సామాజిక కార్యకర్తలు ఈ వీడియోలను 500 మంది సెక్స్ వర్కర్లకు ప్రదర్శించి చూపారు. ఫలితంగా ఒక పునరావాస కేంద్రాన్ని మూసివేశారు. ఈ వీడియోని 2008లో అంతర్జాతీయ ఎయిడ్స్ సదస్సులో బహుళజాతి సంస్థల ప్రతినిధులకోసం ప్రదర్శించటం జరిగింది.

డిజిటల్ కథలు

మన దేశంలో పట్టణాల వీధుల్లో మహిళలపై జరుగుతున్న వేధింపులను వెల్లడిస్తూ ఈ విషయంలో ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేందుకు బ్లాంక్‌నాయిస్ సంస్థ ఒక బ్లాగును ప్రారంభించింది. ఎలా వేధిస్తున్నారు? ఎక్కడ వేధిస్తున్నారు? వంటి వివరాలను మహిళలు ఫొటోగ్రాఫ్‌లతో సహా పంపుతూ, తమ అనుభవాలను ఈ బ్లాగులో పెట్టవచ్చు. ఇక కొన్ని దేశాలలో బాల సైనికుల వ్యథను వీడియోగా తీసింది అజెడికా. దీని ఆధారంగా అంతర్జాతీయ న్యాయస్థానం బాలలను నియమించిన మిలటరీ అధికారులను ప్రశ్నించింది. ఇవన్నీ కూడా కేవలం వీడియో కెమెరా, వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్, ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తూ సాధించిన విజయాలే.

మేం మహిళలం

సంయుక్త రాష్ట్రాలలో నివసిస్తున్న అరీజ్‌ఖాన్ సౌదీ అరేబియాకు చెందిన ఆర్టిస్ట్, గ్రాఫిక్ డిజైనర్. సౌదీ అరేబియాలో మహిళలు వాహనాలను నడపకూడదంటూ ఉన్న చట్టాలపై చర్చను మొదలుపెట్టేందుకు ‘మేం మహిళలం’ పేరిట ఒక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘నడపాలా, వద్దా?’అనే ప్రశ్నకు జవాబును పేర్కొంటూ మహిళలు స్టిక్కర్‌ను రూపొందించి, నేరుగా ఆ ఫొటోలను ‘్ఫ్లకర్ ఫొటో గ్రూపు’లలో, ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్‌చేయవచ్చు. తమ ఐడెంటిటీని వెల్లడి చేయకూడదని భావించేవారు స్టిక్కర్ ఫొటోను ఇ-మెయిల్ ద్వారా పంపితే, దానిని వెబ్‌సైట్‌లో ఉంచుతారు. ఈ స్టిక్కర్‌లను ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్టిక్కర్లద్వారా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవటంతోపాటు ‘మహిళలు డ్రైవింగ్ చేయరాదు’అనే కామెంట్లు కూడా ఈ వెబ్‌సైట్‌లలో ఎక్కువగానే ఉన్నాయి. 2009లో ప్రాజెక్ట్ మొదలుపెట్టిన మొదటి మూడునెలల కాలంలో రెండువేల మంది ఫేస్‌బుక్ పేజీలో తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. ఈ ప్రాజెక్టు కారణంగా సౌదీ అరేబియా, సంయుక్త రాష్ట్రాలలోని మీడియాకూడా మహిళలు వాహనాలను నడపటంపై ఉన్నఆంక్షల గురించి ప్రత్యేక కథనాలను ప్రచురించింది. సమాజంలోని స్థితిగతులను చూసి ఊరుకోకుండా, కనీసం ఒక చర్చను మొదలుపెట్టటం తనకు ఆనందం కలిగించిందని అంటారు అరీజ్. తన వ్యక్తిగత అభిప్రాయాలతో సంబంధం లేకుండా, కమ్యూనిటీయే ఒక సమస్యకు పరిష్కారాన్ని అనే్వషించే ప్రక్రియ ఇది అనేది అరీజ్ అభిప్రాయం.

పర్యావరణ పరిరక్షణకోసం…

ఉత్తర అమెరికాలో గ్రీన్‌పీస్ సంస్థ పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కింబర్లీ క్లార్క్ ఉత్పత్తుల్లో తాజా కలప గుజ్జును ఉపయోగించరాదంటూ ‘క్లీర్‌కట్’ ప్రచార కార్యక్రమాన్ని ఇంటర్నెట్ మాధ్యమంలో చేపట్టింది. క్లీర్‌కట్ వెబ్‌సైట్‌ను సందర్శించే పాఠకుల కాంటాక్ట్ సమాచారాన్ని ‘సివి సిఆర్‌ఎం’ద్వారా సేకరించి, వారికి ఇమెయిల్ అలర్ట్‌లను పంపటం మొదలుపెట్టింది. ఈ అలర్ట్‌లలో ఉండే లింక్‌లను క్లిక్ చేయటం ద్వారా పాఠకులు కింబర్లీ క్లార్క్ వాటాదారులకు తమ అభ్యంతరాలను వ్యక్తంచేస్తూ ఇ-మెయిల్స్ పంపవచ్చు. తమ పట్టణాల్లో ఇ-మెయిల్ లిస్ట్‌లను, ఇ-గ్రూపులను మొదలుపెట్టి ప్రచారాన్ని స్వయంగా చేపట్టవచ్చు. ఇందుకు అవసరమైన క్లీర్‌కట్ యాక్షన్ ప్యాక్, టూల్ బుక్, పోస్టర్లు, మీడియా రిలీజుల వంటి వాటిని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది గ్రీన్‌పీస్ సంస్థ. దీనివలన 30వేల మంది ప్రజలు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ ఉత్పత్తుల్లో కలప వినియోగానికి సంబంధించిన ప్రమాణాలను ప్రవేశపెట్టేందుకు కింబర్లీక్లార్క్ అంగీకరించటంతో అయిదు సంవత్సరాలపాటు నడిపిన ఈ ప్రచార కార్యక్రమానికి ఆగస్టు 2009లో తెరపడింది.

ప్రచార కార్యక్రమానికి సంబంధించిన వెబ్‌సైట్ రూపకల్పనకు ద్రుపాల్‌ను, కాంటాక్ట్‌ల నిర్వహణకు సివి సిఆర్‌ఎంను ఉపయోగించినప్పటికీ, ఆ తర్వాత సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లయిన ఫేస్‌బుక్, మైస్పేస్, ట్విటర్, యూ ట్యూట్ వంటి వాటిని కూడా సంస్థ ఉపయోగించింది.

నిధుల వ్యయం ప్రజల ముందుకు…

స్లొవేకియా ప్రభుత్వ వ్యయాలకు సంబంధించిన ఇన్‌వాయిస్‌లు, ఇతర డాక్యుమెంట్లను ‘సమాచార స్వేచ్ఛ’ ఆధారంగా ఫెయిర్ ప్లే అలియెన్స్ సంస్థ సేకరిస్తోంది. ఇలా సేకరించిన సమాచారాన్ని తమ వెబ్‌సైట్ డాటాబేస్‌లో చేర్చుతోంది. ఈ సమాచారాన్ని ప్రజలు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. యూరోపియన్ యూనియన్ నిధుల దుర్వినియోగం జరిగిందంటూ పలు ఆరోపణలు వెల్లువెత్తటంతో ఫెయిర్‌ప్లే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ప్రభుత్వంలో ఉన్నతస్థానంలో ఉన్న వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నవారి కంపెనీలకే భారీ కాంట్రాక్టులన్నీ దక్కాయని మీడియాలో వార్తలు వెలువడ్డాయి. దాంతో సమాచార స్వేచ్ఛను ఆధారంగాచేసుకొని ఈ కాంట్రాక్టులు ఏయే కంపెనీలకు దక్కాయి? నిధుల వ్యయానికి సంబంధించిన ఇన్‌వాయిస్‌లు, ఇతర అకౌంట్ల సమాచారాన్ని సంస్థ ప్రశ్నించి తీసుకొంటోంది. ఈ సమాచారాన్ని స్కాన్‌చేసిన డాక్యుమెంట్లతో సహా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతోంది. జర్నలిస్టులు, విద్యావేత్తలతో సహా ఆసక్తి ఉన్న పౌరులు సైతం వెబ్‌సైట్‌లో సమాచారం ఆధారంగా విశే్లషణలు చేసి, ప్రత్యేకంగా వార్తాకథనాలు వ్రాయటం మొదలుపెట్టారు. వీటితో కొత్తగా ఆన్‌లైన్‌లో రీడర్స్ ఫోరంలు కూడా ఏర్పాటయ్యాయి. దీంతో చర్చలు, వాదోపవాదాలు ఊపందుకున్నాయి. ఫలితంగా ప్రజా ధనవ్యయంపై పారదర్శకత పెరిగింది. పరిశోధనా పెరిగింది. ఫలితంగా నిర్మాణశాఖకు చెందిన మంత్రి రాజీనామా కూడా చేయవలసి వచ్చింది. ప్రస్తుతం యూరోపియన్ పార్లమెంట్ సభ్యుల ఆస్థుల వివరాలను కూడా తమ వెబ్‌సైట్‌లో ఉంచే ప్రయత్నంలో సంస్థ ఉంది. పలు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ఇపుడు డాటాబేస్‌ను నవీకరించటానికి తమ సమయాన్ని కేటాయించటంతోపాటు అవసరమైన సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లను కూడా అభివృద్ధిచేయటంలో సహకరిస్తున్నారు.

ఒక గొంతు మూగపోతే…

20 జూన్ 2009. ఇరాన్‌లో ఎన్నికల తర్వాత ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనకారులపై జరిపిన కాల్పుల్లో ‘నెడా అఘా సొల్తాన్’ చనిపోయింది. అక్కడే ఉన్న అజ్ఞాత వ్యక్తి ఈ సంఘటనను వీడియో తీసి రెండు చిన్న క్లిప్పింగ్‌లుగా ఇంటర్నెట్‌లో పెట్టాడు. నెడా నోరు, ముక్కు నుంచి రక్తం ధారగా బయటకు కారటం, కళ్లు తెరుచుకొని ఆమె అలాచూస్తూ ఉండటం- ఆ పదహారు, నలభై సెకన్ల వీడియోలలో దర్శనమిచ్చాయి. ఆందోళనకారుల మద్దతుదారులకు ఈ వీడియో క్లిప్పింగ్‌లు ఇ-మెయిల్‌లో అందాయి. ఫేస్‌బుక్‌లో సైతం క్లిప్పింగ్‌లు చోటుచేసుకొన్నాయి. సెన్సార్‌షిప్ అడ్డంకులను అధిగమించేందుకు ఇ-మెయిల్‌ను ఎక్కువగా వాడటం కూడా జరిగింది. యూ ట్యూబ్‌లో పెట్టిన కొద్ది గంటలలోనే ఈ వీడియో సిఎన్‌ఎన్‌లోనూ వచ్చింది. వీడియో షేరింగ్ వెబ్‌సైట్‌లలో ఈ వీడియోలను జనం తిరిగి అప్‌లోడ్ చేయటమూ జరిగింది. ఫిలాసఫీ విద్యార్థిని అయిన 16 ఏళ్ల ఆ యువతి నిస్సహాయంగా రోడ్డుపై మొహం నిండా రక్త్ధారలతో ప్రాణాన్ని విడవటాన్ని చూసిన జనం కంప్యూటర్ తెరలముందు కన్నీళ్లు పెట్టుకొన్నారు. పౌరులే పాత్రికేయులుగా తమ మొబైల్ ఫోన్లు కెమేరాలను ఉపయోగించటానికి ఈ సంఘటన స్ఫూర్తిని కూడా ఇచ్చింది. కన్ను మూసిన కొన్ని గంటల లోపే ఆమె ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్ తెరలపై కొత్త జీవితాన్ని ప్రారంభించింది. హాశ్‌టాగ్ నెడాతో ట్విట్టర్‌లో ఆమె మరణంపై ప్రజల అభిప్రాయాలు వేలాదిగా వచ్చి పడ్డాయి. ప్రపంచం నలుమూలలనుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. స్పానిష్ భాషలో ఒక వ్యక్తి ‘‘నెడా, నీ మరణం వృధాకాలేదు’’ అంటూ ట్విట్టర్‌లో సందేశం పంపాడు.

‘నెడా’అంటే పర్షియన్ భాషలో ‘స్వరం’లేదా ‘పిలుపు’అని అర్థం. ఇపుడు నెడాను ‘వాయిస్ ఆఫ్ ఇరాన్’గా జనం పిలుస్తున్నారు. ‘వియ్ ఆర్ ఆల్ నెడా’ పేరిట ఒక వెబ్‌సైట్‌కూడా ప్రారంభమైంది. ‘‘మేము వాళ్లపై రాళ్లు రువ్వలేదు. స్వేచ్ఛ కావాలన్నాం. వాళ్లు మమ్మల్ని కాల్చారు’’అనే శీర్షిక క్రింద రక్తపు చారలతో ఉన్న నెడా ముఖ చిత్రాన్ని హోమ్ పేజీలో ఉంచారు. దాని క్రింద 13వేలకు పైగా పాఠకులు తమ స్పందనలను వ్యక్తంచేయటం ఆ వీడియోలు తీసిన అజ్ఞాత వ్యక్తి సాధించిన విజయమే!

ఇంకా ఎన్నో…

ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇంటర్నెట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని తోడుగా చేసుకొని ప్రజాఉద్యమాలను నిర్మిస్తున్న సామాజిక కార్యకర్తలు నానాటికీ పెరుగుతున్నారు. ఎస్‌ఎంఎస్, ఎంఎంఎస్, ట్వీట్‌ల ఆధారంగా సమాచారాన్ని క్షణాల్లో అందించేందుకు, ప్రజలను సమీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాలలో మనమూ భాగమవుదాం. *

=====

ప్రపంచం మారుతోంది- మనమూ మారదాం

డిజిటల్ టెక్నాలజీ సాయంతో సామాజిక ఉద్యమాల నిర్మాణం అంశంపై కన్స్యూమర్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్టల్రలో కళాశాల విద్యార్థులు, స్వచ్ఛంద సేవాసంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, మహిళా మండళ్లు, యువజన సంఘాల నిర్వాహకులకోసం మల్టీమీడియా ప్రజంటేషన్లు, ఇంటరాక్టివ్ గేమ్‌లు, గ్రూపులలో చర్చలతో కూడిన వర్క్‌షాప్‌లను కన్స్యూమర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఏర్పాటుచేస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సమాజంలో ఒక మార్పుకోసం ప్రయత్నంచేస్తున్న వ్యక్తులు, సంస్థల గాథలతో ‘టాక్టికల్ టెక్నాలజీ కలెక్టివ్’ సంస్థ రూపొందించిన వీడియోని ప్రదర్శించి, ఆయా అంశాల ఆధారంగా చర్చా కార్యక్రమాన్ని నిర్వహించటం ఈ వర్క్‌షాప్‌లలో ఒక భాగం. ‘ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్’ అంశంపై ఇంజనీరింగ్ విద్యార్థులకు, స్వచ్ఛంద సేవాసంస్థలకు అవగాహనా కార్యక్రమాలను నిర్వహించటంతోపాటు ఉచితంగా వారికి సాఫ్ట్‌వేర్‌ను కూడా అందించింది.

ఆన్‌లైన్‌లో వినియోగదారుల ఫిర్యాదులు

వినియోగదారులలో అవగాహన పెంచేందుకు కమ్యూనికేషన్ మెటీరియల్ అభివృద్ధి, శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, ఆన్‌లైన్ యాక్టివిజం వంటి అంశాలలో కృషిచేస్తున్న కన్స్యూమర్ ఎడ్యుకేషన్ సొసైటీ వినియోగదారుల ఫిర్యాదులను ఇంటర్నెట్ మాధ్యమంలో స్వీకరిస్తోంది. గత ఆరు సంవత్సరాల క్రితమే ఆన్‌లైన్ వెబ్ పాఠం ద్వారా వినియోగదారుల ఫిర్యాదులను స్వీకరించే వ్యవస్థలను సిఇఎస్ శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలకోసం క్రింది వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

===============

పింక్ చడ్డీ ఉద్యమం

2009 సంవత్సరం ఫిబ్రవరిలో కర్నాటక రాష్ట్రంలోని మంగుళూరులో పబ్‌లకు వచ్చిన యువతులపై శ్రీరామ్ సేన కార్యకర్తలమంటూ కొందరు దాడి చేశారు. భారతీయ సంస్కృతిని యువతులు నాశనం చేస్తున్నారంటూ తాముచేసిన పని సరైనదేనని వాళ్లు గర్వంగా చెప్పుకొన్నారు. ఈ సంఘటన అప్పట్లో వార్త్ఛానళ్లకు మంచి పనే పెట్టింది. అది జరిగిన కొన్ని రోజులకే కర్నాటకలో వాలంటైన్స్‌డే రోజున యువతీ యువకులు జంటగా కనిపిస్తే ఊరుకొనేది లేదనీ, వాళ్లకు తక్షణమే వివాహం జరిపిస్తామనీ ప్రకటనలు వెలువడ్డాయి. ఈ ప్రకటనలను నిరసిస్తూ నిషా సుసాన్ అనే ఒక జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ‘పింక్ ఛడ్డీ’ ఉద్యమం ఊపిరి పోసుకొంది. భారతీయ సంస్కృతి పేరుతో జరిగే దాడులను, హింసను ఆపాలని కోరుతూ గులాబీ రంగు ప్యాంటీలను శ్రీరామ్ సేన కార్యాలయానికి పంపి, నిరసన తెలియజేయాలంటూ ఫేస్‌బుక్, బ్లాగుల ద్వారా ప్రచార కార్యక్రమం మొదలైంది. ఒక్కరోజులో 500 మంది సభ్యులుగా చేరారు. వారం తర్వాత 30వేల మంది అయ్యారు. భారతదేశపు ప్రఖ్యాత బ్రాండ్ అయిన ‘అమూల్’ గులాబీ ఛడ్డీతో బిల్ బోర్డును పెట్టింది. గులాబీ రంగులో దుస్తుల మీద కవితలు వెలువడ్డాయి. మొత్తంమీద రెండువేలకు పైగా ప్యాంటీలను సభ్యులు పంపారని సుసాన్ తన వ్యాసంలో పేర్కొంది.

http://consumer.vikasadhatri.org

================

ఈజిఫ్ట్‌లో పోలీసు హింస

పౌరులను ఏదో ఒక రూపంలో వేధిస్తూ మానవ హక్కుల ఉల్లంఘనకు పోలీసులు పాల్పడుతున్న సంఘటనలను వెల్లడించేందుకు ఒక మహిళా జర్నలిస్ట్ ముందుకు వచ్చింది. జర్నలిస్ట్ నోహా అటెఫ్ మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఉంచుతూ టార్చర్ ఇన్ ఈజిప్ట్ పేరిట ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. పాఠకులు కూడా ఈ వెబ్‌సైట్‌కు ఇటువంటి సంఘటనలకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను పంపవచ్చు. ఈ సైట్ ఎంత ప్రఖ్యాతిగాంచిందంటే కొందరు పోలీసులు కూడా వీడియోలను తీసి పంపటం మొదలుపెట్టారు. చట్టవ్యతిరేకంగా జైళ్లలో మగ్గుతున్న ఖైదీలు, లంచగొండులయిన పోలీసులు, పోలీసు హింసకు బలవుతున్న అమాయక ప్రజానీకానికి సంబంధించిన వార్తా చిత్రకథనాలకు నోహా ప్రాముఖ్యతను ఇచ్చేది. ఈమె కథనాలకు స్థానిక మీడియాకూడా స్పందించటంతో 14 సంవత్సరాలుగా జైలులో మగ్గుతున్న ఓ అమాయకుడు విడుదలయ్యాడు.

(గాలి ఉదయ్‌కుమార్,  ఆంధ్రభూమి,  February 27th, 2011)

వ్రాసినది: శ్రీవాసుకి | జనవరి 1, 2011

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ..

బ్లాగ్ మిత్రులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2011 సంవత్సరానికి సుస్వాగతం.

ఈ నూతన సంవత్సరంలో అందరి ఆశయాలు, ఆలోచనలు ఫలవంతమవ్వాలని ఆశిస్తున్నాను. అలాగే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ మరొక్కసారి మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

వ్రాసినది: శ్రీవాసుకి | నవంబర్ 6, 2010

తూతూ మంత్రంగా దీపావళి..!

ఈ సంవత్సరం దీపావళి కూడా వచ్చి వెళ్ళిపోయింది. దీపావళిని చూసి పొందిన ఆనందం పెద్దగా ఏమిలేదు. ఒకప్రక్క టివి లలో తుఫాన్ గురించి భయపెట్టి చంపుతుంటే చేతిదాకా వచ్చిన వరి పంట ఏమవుతుందోనని ఒకటే భయం. అయినా ఇంటిలో చిన్న పాప (మా అమ్మాయి) ఉంది కదా దానికోసం ఏవో కొన్ని సామానులు కొని తెచ్చాను. అవి ధరలెక్కువగా ఉన్నాయి. తీరా నిన్న రాత్రి కాల్చడం మొదలుపెడితే చిచ్చుబుడ్డి వెలుగులకు భయపడి ఇంట్లోకి పారిపోయింది. ఒకే ఒక మతాబు భయం భయంగా కాల్చింది. మిగిలినవి నేను కాల్చుతుంటే మా నాన్నగారి ఒళ్ళో కూర్చుని చూసింది. అలా ఓ అరగంట వీధిలో కాలక్షేపం చేసి దీపావళి అయిందనిపించాము. మేమే కాదులెండి మా వీధిలో మిగిలినవాళ్ళు, ఊరి జనాలు కూడా అరగంటలో తెమెల్చేసారు. ఆరింటికల్లా మొదలుపెట్టేసి ఏడింటిలోపు అవగొట్టేశారు. అంతే దీపావళి అయిపోయింది. చక్కని ఉత్సాహపూరిత వాతావరణం కనిపించలేదు.

మా చిన్నప్పుడయితే దీపావళి రోజు చీకటిపడే వేళకి మా తాతగారు పిల్లలందరినీ అమ్మవారి గుడికి తీసుకెళ్ళి దర్శనం చేయించి దివిటీలు కొట్టించేవారు. తర్వాత ఇంటికొచ్చి భోజనాలు చేసి రాత్రి 8 తర్వాత దీపావళి వేడుక ప్రారంభించేవాళ్ళం. దీపావళి వారం రోజుల ముందు నుండీ మతాబులు, సిసింద్రీలు, తాటాకు టపాకాయల తయారీలో మా చిన్న మావయ్యతో ఉత్సాహంగా పోటీపడేవాళ్ళం. కాలువ గట్టున నిలబడి పిల్లలంతా తారాజువ్వల పోటీ పెట్టుకొనేవాళ్ళం. కొంతమంది వాటిని తారు రోడ్డు మీద కూడా వదిలేవారు. నిజమైన పండుగ ఆనందం పొందిన రోజులవి. మారిన జీవన పరిస్థితుల వల్ల ఇప్పుడు అంత ఉత్సాహం కనిపించుట లేదు. కావల్సిన సామగ్రి అంతా అప్పటికప్పుడు దొరుకుతోంది. అవి పేలకపోయినా, తుస్సుమన్నా ఇంతే సంగతులు. రేట్లు కూడా చాలా ఎక్కువ చెబుతున్నారు. కాని పిల్లలను, పెద్దలను కూడా సమంగా అలరించే పండుగ మాత్రం దీపావళే. పిల్లలు టపాకాయలతో సరదా పడితే, పెద్దలు 1000 వాలాలతో, లక్ష్మీ బాంబులతో పోటీ పడతారు. ఇది ఒక చక్కని పండుగ. జాగ్రత్త లేకపోతే మాత్రం విషాదమే. వచ్చే సంవత్సరం మాత్రం ఈ పండుగ మరింత ఉత్సాహంగా చేసుకోవాలని ఆశిస్తున్నాను. అప్పటికీ మా ఇంట్లోకి ఒక క్రొత్త కుటుంబ సభ్యుడో / సభ్యురాలో వస్తారు. అప్పుడు మాత్రం ఈ తుఫాన్లు, వర్షాల భయాలు ఉండకూడదు. పంటలు బాగా పండాలి. దీపావళి కన్నా అందంగా సంక్రాంతి జరుపుకోవాలి. మీరు, నేను అందరం సంతోషంగా ఉండాలి.

వ్రాసినది: శ్రీవాసుకి | నవంబర్ 5, 2010

తారాజువ్వల తారా తోరణాల దీపావళి

                        తారాజువ్వల తారా తోరణాలు

                       చిచ్చుబుడ్డుల వన్నెల చిన్నెలు

                          సిసింద్రీల అల్లరి పరుగులు

                      మతాబుల ముత్యపు కాంతులు

                    వెన్నముద్దల హరివిల్లు రంగులు

                 విష్ణు చక్రాల చిద్విలాస హోయాగ్నులు

               భూచక్రాల వయ్యారాల మెరుపు నడకలు

             కలిసిన వరుస దీపపు దివ్య కాంతుల హేళి ఈ దీపావళి

          మనలో వెలిగించాలి అజ్ఞానపు చీకట్లను తరిమే జ్ఞాన జ్యోతి.

                 అందరికీ దీపావళి శుభాకాంక్షలు

Older Posts »

వర్గాలు