వ్రాసినది: శ్రీవాసుకి | మార్చి 1, 2011

మహాశివరాత్రి పర్వదినం పట్టిసీమ రండి..

        బ్లాగ్ మిత్రులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.

క్రితం సంవత్సరం శివరాత్రికి పట్టిసీమ వెళ్ళాను కాని ఈ సంవత్సరం సెలవు కుదరకపోవడం వలన వెళ్ళలేకపోతున్నాను. గత సంవత్సరం పట్టిసీమ వెళ్ళి వచ్చాకా శివ శివా ఏల ఈగోల అని ఒక టపా వ్రాసాను. అది నేను బ్లాగింగ్ క్రొత్తగా మొదలుపెట్టిన రోజులు. పట్టిసీమ శివరాత్రి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. గోదావరి మధ్యలో కొండపై కొలువున్న వీరభద్రస్వామికి ఆరోజు నయనానందకరంగా అభిషేకాలు జరుగుతాయి. 2 సంవత్సరాల క్రితం పట్టిసీమ వెళ్ళినప్పుడు లింగోద్భవ సమయంలో స్వామి సన్నిధానంలోనే ఉన్నాను. ఆలయం లోపల ప్రశాంతంగా ఖాళీగా ఉంది. జనమంతా కొండ క్రింద గోదావరి ఇసుక తిప్పలపై జరుగుతున్న తీర్థంలో హడావిడిగా ఉన్నారు. అందువల్ల స్వామి అభిషేక దర్శనం ప్రశాంతంగా జరిగింది మాకు. రాత్రి 12గంటలు దాటిన కూడా కిక్కిరిసిన జనంతో తీర్థం జరిగే ప్రదేశమంతా గోదావరి తల్లి చల్లని గాలుల నడుమ భలే సరదాగా సందడిగా ఉంటుంది.

రాత్రిపూట శివరాత్రి ఉత్సవాలు చూడటం బాగానే ఉంటుందిగాని లాంచీ మీద ఆలయానికి చేరుకోవడం తలకు మించిన పనే. త్రాగుబోతు జనాలు వచ్చి క్యూలో ఉన్నవారిని త్రోయడం, పోలీసులు జనాన్ని చెదరగొట్టడానికి తరమడం చికాకు తెప్పిస్తుంది. మధ్యాహ్న సమయానికల్లా ఆలయ ప్రాంతానికి వెళ్ళిపోవడం ఉత్తమం. అలా వెళ్ళి రాత్రి వరకు అక్కడ తీర్థంలో తిరిగి శివ దర్శనం చేసుకొని రావొచ్చు. శివరాత్రి నాటి ఉదయం నుంచి రెండు రేవుల మధ్య పగలు, రాత్రి లాంచీలు ఎడతెరిపి లేకుండా తిరుగుతూనే ఉంటాయి. పట్టిసీమ రావడానికి పోలవరం మండలం, కొవ్వూరు మండలం, తాళ్ళపూడి మండలం, రాజమండ్రి మరియు కోనసీమ వంటి ఇతర ప్రాంతాల నుంచి కూడా బస్ సౌకర్యం ఆ మర్నాటి రోజు వరకు ఉంది. అవకాశం ఉన్నవారు ఆటోలలో, కారులలో కూడా వస్తారు. అందుచేత ప్రయాణపరమైన ఇబ్బందులు ఏమి ఉండవు. ప్రసిద్ధమైన పాపికొండల ప్రయాణం కూడా ఈ పట్టిసీమ నుంచే ప్రారంభం అవుతుంది.

శివరాత్రినాటి ఉదయం నుంచి వివిధ సంఘాల వారు రెండు రోజులపాటు ఉచిత భోజనం, ఫలహారం పెడతారు. అవన్నీ కూడా ఆలయ సమీపంలో గోదావరి ఒడ్డున ఉంటాయి. రాత్రి 12 గంటల వరకు భోజనానికి ఇబ్బంది ఉండదు. అందమైన తూర్పుకనుమల (కొండలు) మధ్య ప్రవహించే గోదావరి ఆ నది మధ్యలో దేవకూటంపై వెలిసిన భద్రకాళీ సమేత వీరభద్రుడు, నిరంతరం చల్లగా సేద తీర్చే గోదావరి గాలులు, దేదీప్యమైన విద్యుత్కాంతుల నడుమ అశేష జన సందోహ కోలాహాలం ఇదే మహాశివరాత్రి నాటి పట్టసాచల (పట్టిసీమ) వైభవం.


స్పందనలు

  1. బాగాచెప్పేరు,మీకూ ఈవేళ చెప్పలనిపించింది, చిత్రం.


వ్యాఖ్యానించండి

వర్గాలు