వ్రాసినది: శ్రీవాసుకి | ఏప్రిల్ 5, 2010

ఆర్.ఎస్.ఎస్. పుస్తక పరిచయం…!

నేటి మన హిందూ దేశంలో, కేవలం వారికొరకే పనిచేసే సంస్థ, ఆర్‌యస్‌యస్‌ను అపార్థం చేసుకున్నట్లుగా, ఇంకా దేనినీ అపార్థం చేసుకోరేమో! అదీ హిందువులే. అటువంటి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్థాపకులు, డా.కేశవరావు బలిరాం హెడ్గెవార్‌గారి సమగ్ర జీవిత చిత్రణ ఇది. ఒక నవలగా సాగే, స్వర్గీయ గోపాల్ నీలకంఠ దాండేకర్‌గారి రచనకు, ఇంకో కార్యకర్త రాంభావ్ హల్దేకర్‌గారి అనువాదమిది.

ఫైజాపూర్‌లో కాంగ్రెసు మహాసభలు జరుగుతున్నాయి. దాని ప్రారంభంలో, పండిట్‌జీ ధ్వజారోహణ చేస్తున్నారు. 80 అడుగుల ధ్వజ స్తంభం, కాని పతాకం మధ్యలో ఇరుక్కుపోయింది. ఎంత కదిలించినా పైకి వెళ్లటంలా. ‘ఇది చూచి, శిర్‌పూర్ ఆర్‌యస్‌యస్ శాఖకు చెందిన ఒక స్వయంసేవక్ కిషన్‌సింగ్ పరదేశీ ముందుకొచ్చి, శిక్షణ పొందిన కోతిలాగా చరచర పైకి ప్రాకి, తాడును సరిచేశాడు. ధ్వజారోహణ జరిగింది. అతని సాహసం ప్రేక్షకులకు అమిత సంతోషాన్ని కలిగించింది, అతని మీద రూపాయల వర్షం కురిపించారు. అతనిని బహిరంగ సభలో సన్మానించాలని నిర్ణయించబడింది. కాని ఇంతలో అతను స్వయసేవక్ అని తెలియటంలో ఆలోచన మానుకున్నారు.

డాక్టర్జీకి ఈ వార్త నాసిక్ చేరిన తరువాత తెలిసింది. ఈ విషయం 1937 మార్చి 23న ధూలియాలో చెబుతూ దేవపురా శాఖలో అతనిని చక్కగా అలంకరించిన కుర్చీలలో కూర్చోబెట్టి, వెండి గ్లాసును బహుకరించి సత్కరిస్తూ ‘దేశ గౌరవం ఎక్కడ ఆగిపోయినా, అది ఏ పార్టీకి చెందినదనే ఆలోచన లేకుండా, పరిగెత్తుకు వెళ్లటం మన కర్తవ్యం. ఈ పని కిషన్‌సింగ్ పూర్తిచేశాడు. ఈరోజు అతనికి చేసిన ఈ సత్కారం, అతని ప్రవృత్తికి చేసిన సన్మానం’ అన్నారు డాక్టర్జీ.

సుమారు 300 పుటలలో, అతి వివరంగా చిత్రించబడిన ఈ రచనలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. మన నిజామాబాద్ జిల్లా, బోధన్ తాలూకాలో గోదావరి, మంజీరా, హంద్రా నదుల సంగమంవద్ద ఉన్న తీర్థక్షేత్రం కందకుర్తి, అందువల్ల అక్కడ అనేక వైదిక కుటుంబాలు స్థిరపడ్డాయి. కందెకుర్తీశ్వరుని దేవాలయం శిథిలావస్థకు చేరటంతో, దాని పునర్నిర్మాణానికి పూనుకొని అర్జీలు పెట్టుకున్నారు. దేవాలయ శిఖరం, మసీదు శిఖరంకంటే ఎక్కువ ఎత్తుండగూడడదన్న షరతు! దానితో నిష్ఠాపరుడు నరహరశాస్ర్తీ హెడ్గేవార్, కందకుర్తి వదిలి, భోంస్లే రాజపరివారం ఉన్న నాగపూర్‌కు శాశ్వతంగా తరలిపోయారు.

హెడ్గేవార్ వంశ వారసత్వంలో, బలీరాంపంత్ కుమారుడే ఈ డాక్టర్జీ. జననం 1889 ఏప్రిల్ 1న. చిన్నతనంలోనే, తల్లితండ్రి ఇద్దరూ ఒకే రోజున ప్లేగువ్యాధితో మరణించటం, కొద్దిరోజుల తరువాత యావత్‌మల్ ప్రయాణం, అక్కడ చదువు, తరువాత కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీలో విద్యాభ్యాసంకోసం కలకత్తా ప్రయాణం.  తిరిగి డాక్టరుగా నాగపూర్ వచ్చిన తరువాత, అదే ప్లేగు వ్యాధితో అన్న మహిదేవశాస్ర్తీ మరణం.  వీటిమధ్య, 1925 విజయదశమిన సంఘ ప్రారంభం, వారి మనస్సులోని పేరే, దానికి 17-4-26 నుండి ‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ’ అనే పేరును శాశ్వతం చేయటం. అలాగే 1936లో, స్వర్గీయ కేల్కర్‌గారి భార్య శ్రీమతి లక్ష్మీబాయ్ కేల్కర్ వారిని కలిసి, వారి అనుమతితో, విజయదశమి రోజునే ‘రాష్ట్రీయ సేవికా సమితి’ని ప్రారంభించారు.   1936లోనే వారు లోదాలో జరిగిన కార్యక్రమంలో సంఘ కార్యాన్ని స్పష్టంగా వారు నిర్వహించారు. ‘సంఘంలో సంధ్యావందనం నేర్పారు. భోజనానికి కూర్చున్నప్పుడు, ప్రక్కవారి కులం అడగరు. అలాంటి స్థితిలో, సంఘాన్ని హిందూ ధర్మ సంరక్షుకులని ఎలా అంటారని కొంతమంది అడుగుతుంటారు.

‘కాని ఒక విషయాన్ని అర్ధంచేసుకోవాలి. ధర్మరక్షణ, ధర్మపాలన వీటిలో తేడా ఉంది. స్నానం, సంధ్యలాంటి వైయక్తిక ఆచారం పాటించటమంటే ధర్మరక్షణ కాదు. ఎవరికైతే ధర్మరక్షణ చేయవలసిన బాధ్యత ఉందో, వారిలో ధర్మంమీద జరుగుతున్న దాడిని ఎదుర్కొనే బలం అవసరం. … దాడి చేసే ప్రవృత్తి ఇతరులలో పెరుగుతున్నది. దానిని అక్కడే ఆపాలి. ఎవరైతే రొమ్ము విరిచి తలెత్తి జీవిస్తారో, దానికి కావలసిన శీలాన్ని, అనుశాసనాన్ని కలిగి ఉంటారో, అతడే హిందువు, వీటిని సమాజానికి నేర్పేవారే హిందువులు… హిందుత్వం ఈ దేశం యొక్క ప్రాణం, దాని రక్షణ బాధ్యత హిందువులే స్వీకరించాలని సంఘ్ కోరిక.’

ఇంకా ఈ పుస్తకంలో గాంధీజీ, సావర్కర్, డా.వనంజీలతో సంభాషణలు, పండిత్ మదన్‌మోహన్ మాలవీయా- ఇలా అనేకానేక పెద్దల తోటి చర్యలు, సంభాషణలు కోకొల్లలుగా ఉన్నాయి. గాంధీజీ ఆర్‌యస్‌యస్ శిబిరాన్ని దర్శించటం ఒక విశేషం. అలాగే డా.శ్యాంప్రసాద్ ముఖర్జీ, వారు అస్వస్థులై చివరి దశలో ఉన్నప్పుడు, సుభాష్ చంద్రబోస్ రాక, కాని మాట్లాడుకోలేక పోయారు.  1920 జూలై 31న లోకమాన్య తిలక్ మరణంలో, నాగపూర్‌లో జరగవలసిన కాంగ్రెస్ మహాసభలకు అధ్యక్షత వహించవలసిందని, పాండుచేరిలో ఉన్న శ్రీ అరవిందులను ఆహ్వానించేందుకు డా.వనంజీ, డా. హెడ్గెవార్‌లు వెళ్లటం, నిరాశతో రావటం- ఇలాంటివి కోకొల్లలు ఉన్నాయి. చరిత్ర పట్ల ఆసక్తిగల ప్రతివారూ చదివి తీరవలసిన పుస్తకం.

**ఈ వ్యాసం ఆంధ్రభూమి దిన పత్రిక నుండి తీసుకోవడమైనది. దాని తాలూకు లింక్ ఇక్కడ ఇస్తున్నాను.

 ఆంధ్రభూమి   (http://www.andhrabhoomi.net/aadivavram-andhrabhoomi/book-review-670 )

పుస్తకం కావల్సిన వారికి చిరునామా ఇది.

‘పెను తుఫానులో దీపస్తంభం’

మరాఠీ మూలం : గోపాల్ నీలకంఠ్ దాండేకర్, అనువాదం: రామచంద్ర సదాశివ హల్దేకర్

వెల 100/-

ప్రతులకు: సాహిత్యనికేతన్, 3-4-852,కేశవనిలయం,బర్కత్‌పురా, హైదరాబాద్ -500 027

వ్రాసినది: శ్రీవాసుకి | మార్చి 31, 2010

వేదంలా ఘోషించే గోదావరి…!

           ఆంధ్రకేసరి చిత్రంలోని ఈ పాటంటే నాకు ఇష్టం. మీ కోసం ఇక్కడ.

వేదంలా ఘోషించే గోదావరీ
అమరదామంలా శోభిల్లె రాజమహేంద్రీ
శతాబ్దాల చరిత గల సుందర నగరం
గతవైభవ దీప్తులతో కమ్మని కావ్యం

రాజ రాజ నరేంద్రుడు, కాకతీయులు
తేజమున్న మేటి దొరలు రెడ్డి రాజులు
గజపతులు నరపతులు ఏలిన ఊరు
ఆ కథలన్ని నినదించె గౌతమి హొరు ||వేదంలా||

ఆది కవిత నన్నయ్యా రాసెనిచ్చటా
శ్రీనాధ కవి నివసం పెద్ద ముచ్చటా
కవిసార్వభౌమలకిది ఆలవాలము
నవ కవితలు వికసించె నందనవనము ||వేదంలా||

దిట్టమైన శిల్పాల దేవలాలు
కట్టుకదల చిత్రాంగి కనక మేడలు
కొట్టుకొని పోయె కొన్ని కొటిలింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలు ||వేదంలా||

వేదంలా ఘోషించే గోదావరీ
అమరదామంలా శోభిల్లె రాజమహేంద్రీ
శతాబ్దాల చరిత గల సుందర నగరం
గతవైభవ దీప్తులతో కమ్మని కావ్యం ||వేదంలా||

వ్రాసినది: శ్రీవాసుకి | మార్చి 23, 2010

ఇది చూసి భయపడకండి…!

                                        

 

నా అభిమాని గోడు అనే సిరీస్ లో చెప్పానుగా నేను జాకీచాన్ వీరాభిమానినని. అదిగో అలా ఆ అభిమానంతోనే ఇంటర్ చదివే రోజులలో కుంగ్-ఫూ నేర్చుకున్నాను. అలాగని ఎవరిని కుమ్మింది లేదు తన్నింది లేదు. మూణ్ణాల ముచ్చటలా సంవత్సరం ఆరు నెలల తర్వాత నా విద్యకి బ్రేక్ పడింది. కారణం నేర్పే గురువు మా అందరికి టాటా చెప్పేసారు.  లేదంటే ఆంధ్రా జాకీచాన్ ని చూసేవారు మీరంతా. అప్పట్లో కసిగా వారం రోజుల భయంకర సాధన తర్వాత నేను ప్రదర్శించిన, మా గురువుగారికి ఇష్టమైన ఫ్లయింగ్ కిక్ చిత్రమిది. నన్ను అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు బాధపెట్టే మరపురాని ఓ తీపి గుర్తు.

వ్రాసినది: శ్రీవాసుకి | మార్చి 21, 2010

శ్రీ శృంగార వల్లభ స్వామి…!

                                    శ్రీ శృంగార వల్లభ స్వామి
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలంలో ఉన్న ఒకానొక గ్రామం తిరుపతి. దీనిని చదలవాడ తిరుపతి, తొలి తిరుపతి అని అంటారు. ఇక్కడ స్వామి వారి పేరు శ్రీ శృంగార వల్లభస్వామి. సామర్లకోట రైల్వే స్టేషన్ నుంచి 12 కి.మీ, రాజమండ్రికి 45 కి.మీ దూరంలో ఉంది. ఈ ఆలయ స్తంభాలపై ఉన్న శిలా శాసనములను బట్టి 9 వేల సంవత్సరముల చరిత్ర గలదిగా తెలుస్తోంది. ఈ స్వామి ప్రత్యేకత ఏమంటే “ఎవరు ఎంత ఎత్తు ఉంటే వారికి అంతే ఎత్తు కనబడతాడు”.
పూర్వకాలంలో ఈ ప్రాంతమంతా కీకారణ్యము. ధృవుని తల్లి సునీత. ధృవుని సవతి తల్లి ధృవుడు సిం హాసనం ఎక్కకుండా తంత్రాలు నడుపుతుంది. సునీత, ధృవుని పిలిచి నీవు సిం హాసనం అధిష్టించి, రాజ్యపాలన చేయాలి. అందుకు శ్రీ మహా విష్ణువు దర్శన భాగ్యం కలగాలి. ఆయన దయతో నీకు రాజ్యపాలన యోగం కలుగుతుంది. అందుచేత తపమాచరించి, విష్ణు దర్శనం పొంది, రాజ్యాధికారం సంపాదించమని చెప్పి అడవులకు పంపుతుంది.
అలా బయలుదేరిన ధృవుడు, ఈ కీకారణ్య ప్రదేశమునకు చేరుకున్నడు. ఇచ్చట శాండిల్య మహాముని ఆశ్రమం ఉన్నది. ఆ మునీశ్వరుని దర్శనం చేసుకున్న ధృవుని చూచి, అతని మనసులోని కోరిక తెలిసినవాడై, ముని అతన్ని పిలిచి “నాయనా విష్ణుమూర్తి యొక్క దివ్య మంగళ రూపం తలుచుకొంటూ తపస్సు చెయ్యి. స్వామి ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాడు అని చెప్పినారు. మునీశ్వరులు చెప్పినట్లుగా తపమాచరించుట మొదలుపెట్టినాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత, ధృవుని తపస్సుకి మెచ్చినవాడై విష్ణుమూర్తి దర్శనమిచ్చాడు. దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న విష్ణుమూర్తిని చూచి ధృవుడు భయపడ్డాడు. అంతట విష్ణువు “బాలక భయమెందుకు తత్తరపాటు చెందకు నేను నీ అంతే కదా ఉన్నాను” అని నవ్వుతూ పలుకటయే కాకుండా చెక్కిళ్ళు ఒత్తి భయము లేకుండా చేసినాడు. స్వామి అక్కడే శిలారూపంలో వెలసినాడు. ఇది స్థలపురాణము.
ఆ దివ్యమంగళ సుందరమూర్తియే శ్రీ శృంగార వల్లభస్వామిగా పేరుగాంచాడు. “నీ అంతే ఉన్నాను కదా” అన్ని చెప్పిన కారణంగా చూసే భక్తులు ఎంత ఎత్తు ఉంటే అంతే ఉన్నట్లుగా దర్శనమిస్తాడు స్వామి. చెక్కిళ్ళు ఒత్తిన కారణంగా కుడి ఎడమలకు ఉండవలసిన శంఖు చక్రములు ఎడమ, కుడిలకు ఉంటాయి. స్వామి వారు వెలిసిన కొంతకాలానికి దేవతలు వచ్చి స్వామి వారికి ఆలయనిర్మాణం చేసినారు. తరువాత లక్ష్మీదేవి, నారదుడు. ఈ యుగమున శ్రీ కృష్ణదేవరాయలు వారు భూదేవి అమ్మవారి తామ్ర విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు శిలాశాసనములు ద్వారా తెలియచున్నది. భోజమహారాజు, భట్టివిక్రమార్కులు, రుద్రమదేవి, పెద్దాపురం సంస్థాన మహారాణులు ఈ స్వామిని దర్శించుకొన్నవారిలో కొందరు. విక్టోరియా మహారాణి స్వామిని దర్శించి వెండి కవచము చేయించినట్లు చెబుతారు. పిఠాపురం రాజులు స్వామి వారికి 600 ఎకరాల భూమిని దానం ఇచ్చారు. కాని ప్రస్తుతం 21 ఎకరాలు మిగిలింది. నిత్య దీపధూప నైవేద్యాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం దివ్యంగా జరుగుతుంది. అయితే ఈ ఆలయమునకు అంతగా ప్రచారం లేకపోవడం వలన కేవలం చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలే ఎక్కువగా దర్శించుకొంటారు.
వ్రాసినది: శ్రీవాసుకి | మార్చి 20, 2010

“ఆయన” తెచ్చిన తంటా ..!

మన తెలుగు భాషలో ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క యాస మరియు కొన్ని ప్రత్యేక పదాలు. ఒకచోట ఒప్పు అన్న పదం మరోచోట తప్పు కావచ్చు. నేను కూకట్ పల్లి లో ఉన్న రోజుల్లో ఒక చిన్న సంఘటన జరిగింది. మా ప్రక్క రూం లో మెదక్ జిల్లా సిద్ధిపేట నుంచి వచ్చిన అబ్బాయిలు ఉండేవారు. అందులో ఒకతను సి.ఎ. చదువుతూండేవాడు. అతను చదువుతూనే ఛార్టెడ్ ఎక్కౌంట్ దగ్గర పనిచేసేవాడు. అతని ఆఫీస్ లోనే గోదావరి జిల్లా అమ్మాయి పనిచేస్తోంది. ఒకరోజు ఏదో అవసరమొచ్చి ఆ అమ్మాయి ఇతన్ని ఏవండీ అని రెండుసార్లు పిలిచిందట. అలాగే వేరే వాళ్ళతో మరో విషయమై ఆయన్ని అడగండి అందిట. ఆ అమ్మాయి “ఏవండీ, ఆయన” అని సంభోధించడం ఈ అబ్బాయికి నచ్చలేదు. ఆ పిలుపిని తప్పుగా అర్థం చేసుకొని ఆ అమ్మాయి చెంప మీద కొట్టాడు. దానితో పాపం అమ్మాయి ఏడుపు. “ఆయన, ఏవండీ” అని ఇంకెప్పుడు పిలవొద్దని చెప్పి వచ్చేసాడుట. రూం కొచ్చిన తర్వాత నాతో ఈ విషయాలు చెప్పాడు. అతని దృష్టిలో ఆయన, ఏవండీ అనే మాటలను తెలంగాణా ప్రాంతంలో భర్తలను మాత్రమే పిలవడానికి అంటారన్నాడు. అందుకే కొట్టానన్నాడు. అప్పుడు నేనన్నాను గోదావరి జిల్లాలలో భర్తని మాత్రమేగాక, తెలియని వారిని, పెద్దవాళ్ళని ఏవండీ అని, ఆయన అని గౌరవంగా సంభోధించడం కోసం అలా అంటారని చెప్పా. ఆ అమ్మాయి ఆ ఉద్దేశ్యంతోనే గౌరవంగా పిలిచిందన్నా. మనవాడికి అప్పుడు అర్థమయింది. మర్నాడు ఆఫీస్ కెళ్ళాక సారీ చెబుతానన్నాడు దానితో పాటు తెలంగాణలో ఆ పిలుపు అర్థం కూడా చెప్పమన్నా. అపార్థాలు తొలగాలి కదా మరి. ఒకొక్కసారి మాట తెచ్చే తంటా ఇలాగే ఉంటుంది. జాగ్రత్త సుమీ.

వ్రాసినది: శ్రీవాసుకి | మార్చి 14, 2010

ఓ అభిమాని గోడు-4….హంపి యాత్ర

      బ్లాగ్ మిత్రులు అందరికి వికృతనామ ఉగాది శుభాకాంక్షలు.

ఉదయాన్నే మా ఊరు నుంచి విజయవాడ వెళ్ళే బస్సు ఎక్కాను. నాలుగు గంటల ప్రయాణం తర్వాత బెజవాడలో దిగి రైల్వే స్టేషన్ కి వెళ్ళాను. అక్కడ అమరావతి-వాస్కోడిగామా వెళ్ళే రైలెక్కాను. ఒక రాత్రంతా ప్రయాణం. కూర్చున్నది సామాన్య తరగతిలో, నిద్రపోయే అవకాశం లేదు. బుర్రలో బొంగరంలా తిరుగుతున్నాయి రకరకాల ఆలోచనలు జాకీచాన్ ని ఎలా కలవాలి, కలిస్తే ఏమి మాట్లాడాలంటూ. మనకేమో ఇంగ్లీష్ పెద్దగా రాదు. పక్కా తెలుగు మాధ్యమం మరి. ఇన్ని ఆలోచనల మధ్య ఎప్పుడు నిద్రపట్టిందో తెలీదు. లేచేసరికి ఆరయింది. అప్పటికి రైలు బళ్ళారి దగ్గరకి వచ్చింది. ఇంక చూసుకోండి మనకి ఒకప్రక్క ఆతృత, మరోప్రక్క ఆనందం. మరికొంత సమయానికి రైలు హోస్పేట్ చేరుకుంది. నేను దిగాల్సింది ఇక్కడే. నెమ్మదిగా స్టేషన్ బయటకు వచ్చి బస్టాండ్ ఎదురుగా ఉన్న ఒక లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాను.  త్వరత్వరగా స్నానాదికాలు పూర్తిచేసుకుని ప్రక్కనే ఉన్న హోటల్లో కన్నడ సాంబారిడ్లీ తిని హంపి వెళ్ళే బస్సులో కూర్చున్నాను. ఒకప్రక్క మనసులో కందరీగ రొదలా ఒకటే ఆలోచనలు.

ఒక అరగంట ప్రయాణం తర్వాత హంపిలోని విరూపాక్ష ఆలయం దగ్గర బస్సు ఆగింది. దిగి గబగబా వెళ్ళి టికెట్ తీసుకొని లోనికెళ్ళాను. వాతావరణమంతా ప్రశాంతంగా ఉంది. నిదానంగా స్వామి దర్శనం చేసుకొని ఆలయ మండపం బయటకు వచ్చి మేనేజ్మెంట్ వార్ని జాకీచాన్ షూటింగ్ గురించి అడిగితే వాళ్ళు నిన్న సాయంత్రమే షూటింగ్ అయిపోయి జాకీచాన్, నేను అక్కడ దిగిన ప్రొద్దునే హాంకాంగ్ వెళ్ళిపోయిన విషయం చెప్పారు. నాకొక పెద్ద షాక్. బుర్ర తిరిగింది. ఇంత ప్రయాస పడి వస్తే ఇలా జరిగిందేమిటబ్బా అని మనసులో బాధ. కాసేపు అక్కడే కూర్చుండిపోయాను. మళ్ళీ రకరకాల ఆలోచనలు వెంటనే వెనక్కి వెళ్ళిపోదామనిపించింది. అలా అనుకొని బయటకు వచ్చి ప్రక్కనే ఉన్న కొట్టులో ఇంగ్లీష్ పేపరొకటి కొని చదివాను. అందులో నిన్న సాయంత్రంతో 15 రోజుల షూటింగ్ అయిపోయిందని, ఈరోజు ఉదయమే 6 గం.ల విమానానికి జాకీచాన్ వెళ్ళిపోయాడని  అది చదవగానే మనసు ఉసూరుమనిపించింది. ఇంటికి ఫోన్ చేసి విషయం చెబితే వాళ్ళు బాధపడ్డారు. బయలుదేరి వచ్చేయమన్నారు. సరే అని ఫోన్ పెట్టేసా.

ఆతర్వాత కాసేపు ఆలోచించి నేను వచ్చింది దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికిన రాయల వారింటికి కదా  అనుకొని ఆ చుట్టుప్రక్కలంతా చూడాలని నిర్ణయించుకొన్నాను. ఆరకంగా నా బాధ కూడా మర్చిపోవచ్చు కదా. ఆ ప్రదేశాలన్ని చూపించడానికి ఒక ఆటో మాట్లాడుకున్నాను. ఒంటికాయ సొంఠికొమ్ములా నేనొక్కడ్నే ఆటోలో చక్కర్లు మొదలెట్టా.  జాకీచాన్ షూటింగ్ ఎక్కడెక్కడ జరిగిందో అవన్నీ చూపించాలని ఆటో అబ్బాయికి ముందే చెప్పా. అదిగో అలా ప్రసిద్దమైన హజారరామ దేవాలయం, కమల మందిరం (మహారాణి అంతఃపురం), ఆనెగొంది, మణులు మాణిక్యాలు రాశులుగా పోసి అమ్మిన బజారు తుంగభద్ర నది సమీపంలోనే ఉంది. ఇంకా విజయవిఠల్ ఆలయం. ఇక్కడ స్తంభాలాన్నీ సప్తస్వరాలు పలుకుతాయి. మనం వాటిని కొట్టి చూడవచ్చు. కాని ఏ ఆలయంలోను విగ్రహాలు లేవు. కృష్ణదేవరాయల మరణాంతరం ఇవన్నీ కూడా ముస్లింల దండయాత్రలో నాశనం చేయబడ్డాయి. తళ్ళికోట వద్ద జరిగిన ఘోరయుద్ధంతో విజయనగర సామ్రాజ్య వైభవం గతించింది. ఇంకా నవమి దిబ్బ రాయలు వారు ఏ యుద్ధలో విజయం సాధించిన దాని గుర్తుగా ఒక నిర్మాణం చేసేవారు అలాంటిదే ఈ నవమి దిబ్బ.విశాలమైన,చదునైన దీర్ఘచతురస్రాకారపు రాతి కట్టడమిది. ఇక్కడ దసరా ఉత్సవాలు జరిగేవట. దానికి దగ్గరలోనే శ్రీచక్ర ఆకారంలో లోపలికి నల్ల మెట్లు కలిగిన చెరువు. దీని ద్వరా వారు త్రాగు నీరు రాతి గొట్టాల ద్వారా నగరంలోకి పంపేవారు. అవన్నీ మనం అక్కడ చూడొచ్చు. తుంగభద్ర నది దాటితే అవతల ప్రక్క ఉండేది ఆనెగొంది. విజయనగరం యొక్క పాత రాజధాని. తర్వాత రాయల కాలంలో అనుకొంటా దానిని హంపికి మార్చారు. చిరుతిళ్ళు తింటూ ఇంకా ఇతర దేవాలయాలు, ప్రదేశాలు కూడా చుట్టబెట్టేశాను. తిరిగి 5 గం.ల కు విరూపాక్షాలయం దగ్గరికి వచ్చి హోస్పేట్ వెళ్ళే బస్సు ఎక్కాను. ఈ విరూపాక్ష ఆలయంలో మాత్రం ఈనాటికి శివలింగానికి పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి. ఎందుచేతనో మొఘలు రాజులు దీని జోలికి రాలేదు.

సరే హోస్పేట్ లో దిగిన తర్వాత ఇంకా ఏదో భ్రమ తీరక అక్కడున్న ఆటో అతన్ని జాకీచాన్ ఏ హోటల్లో ఉండేవాడో అడిగి అక్కడికి వెళ్ళాను. దాని పేరు మల్లిక్ మరేదో గుర్తులేదు. రిసెప్షన్ దగ్గర నన్ను పరిచయం చేసుకొని నా దగ్గరున్న జాకీచాన్ సభ్యత్వ కార్డ్, ఫోటోలు చూపిస్తే వాళ్ళూ లోపలికి పంపించారు. అక్కడ ఇంకా సినిమా సిబ్బంది ఉన్నారు. వాళ్ళని పరిచయం చేసుకొని నా వచ్చీరాని ఆంగ్ల భషలో జాకీ “ది మిత్” సినిమా వివరాలు అడిగి కాసేపు నాలో నేను సంతోషపడి కొద్దిపాటి ఆనందం, బాధ కలగలిపిన ముఖంతో బయటకు వచ్చేసాను. అక్కడ నుంచి తాపీగా నడుచుకొంటూ రూం కొచ్చి స్నానం చేసి మంచం మీద పడ్డాను. ఇంతలో కడుపు కాలి మళ్ళా బయటకు వెళ్ళి కొద్దిగా మేసి ఇంటికో ఫోన్ కొట్టి ఇటునుంచి హైదరాబాద్ వెడుతున్న విషయం చెప్పాను. గదికొచ్చి నిద్రపోబోతే అన్నీ అవే ఆలోచనలు. అనుకున్న వ్యక్తిని చూడలేకపోయానని ఒకప్రక్క, అనుకోనిరీతిలో హంపిని చూడగలిగానని మరోప్రక్క బాధానందం. ఏంచేస్తాం కొన్నిసార్లు అంతే. ఇదేమి జీవన్మరణ సమస్య కాదు అంత ముఖ్యము కాదు అయినా ఇప్పటికీ అదో ఎడతెరిపిలేని ఆలోచనతో కూడిన బాధ ఓ మంచి జ్ఞాపకం కోల్పోయాను కదా అని. ఆ వయసుకి అదొక ఆనందం. ఇప్పుడు తలుచుకొంటే ఆ సరదాలు, ప్రయాసలు నవ్వు తెప్పిస్తాయి. ఇప్పుడు నా జ్ఞాపకాలు జాకీచాన్ దగ్గరి నుండి వచ్చిన ఉత్తరాలు, ఆటోగ్రాఫ్ ఫోటోలు అలానే ఉన్నాయి నాకేసి చూసి నవ్వుతున్నట్టుగా.

(అయిపోయింది)

*మీ కోసం నాకొచ్చిన జాకీచాన్ ఫోటోలు ఇక్కడ పెడుతున్నాను . వాటి మీద జాకీచాన్ స్వహస్తంతో చేసిన సంతకం, నా పేరు ఉంటాయి* చూడండి.

« Newer Posts - Older Posts »

వర్గాలు