వ్రాసినది: శ్రీవాసుకి | నవంబర్ 6, 2010
తూతూ మంత్రంగా దీపావళి..!

ఈ సంవత్సరం దీపావళి కూడా వచ్చి వెళ్ళిపోయింది. దీపావళిని చూసి పొందిన ఆనందం పెద్దగా ఏమిలేదు. ఒకప్రక్క టివి లలో తుఫాన్ గురించి భయపెట్టి చంపుతుంటే చేతిదాకా వచ్చిన వరి పంట ఏమవుతుందోనని ఒకటే భయం. అయినా ఇంటిలో చిన్న పాప (మా అమ్మాయి) ఉంది కదా దానికోసం ఏవో కొన్ని సామానులు కొని తెచ్చాను. అవి ధరలెక్కువగా ఉన్నాయి. తీరా నిన్న రాత్రి కాల్చడం మొదలుపెడితే చిచ్చుబుడ్డి వెలుగులకు భయపడి ఇంట్లోకి పారిపోయింది. ఒకే ఒక మతాబు భయం భయంగా కాల్చింది. మిగిలినవి నేను కాల్చుతుంటే మా నాన్నగారి ఒళ్ళో కూర్చుని చూసింది. అలా ఓ అరగంట వీధిలో కాలక్షేపం చేసి దీపావళి అయిందనిపించాము. మేమే కాదులెండి మా వీధిలో మిగిలినవాళ్ళు, ఊరి జనాలు కూడా అరగంటలో తెమెల్చేసారు. ఆరింటికల్లా మొదలుపెట్టేసి ఏడింటిలోపు అవగొట్టేశారు. అంతే దీపావళి అయిపోయింది. చక్కని ఉత్సాహపూరిత వాతావరణం కనిపించలేదు.
మా చిన్నప్పుడయితే దీపావళి రోజు చీకటిపడే వేళకి మా తాతగారు పిల్లలందరినీ అమ్మవారి గుడికి తీసుకెళ్ళి దర్శనం చేయించి దివిటీలు కొట్టించేవారు. తర్వాత ఇంటికొచ్చి భోజనాలు చేసి రాత్రి 8 తర్వాత దీపావళి వేడుక ప్రారంభించేవాళ్ళం. దీపావళి వారం రోజుల ముందు నుండీ మతాబులు, సిసింద్రీలు, తాటాకు టపాకాయల తయారీలో మా చిన్న మావయ్యతో ఉత్సాహంగా పోటీపడేవాళ్ళం. కాలువ గట్టున నిలబడి పిల్లలంతా తారాజువ్వల పోటీ పెట్టుకొనేవాళ్ళం. కొంతమంది వాటిని తారు రోడ్డు మీద కూడా వదిలేవారు. నిజమైన పండుగ ఆనందం పొందిన రోజులవి. మారిన జీవన పరిస్థితుల వల్ల ఇప్పుడు అంత ఉత్సాహం కనిపించుట లేదు. కావల్సిన సామగ్రి అంతా అప్పటికప్పుడు దొరుకుతోంది. అవి పేలకపోయినా, తుస్సుమన్నా ఇంతే సంగతులు. రేట్లు కూడా చాలా ఎక్కువ చెబుతున్నారు. కాని పిల్లలను, పెద్దలను కూడా సమంగా అలరించే పండుగ మాత్రం దీపావళే. పిల్లలు టపాకాయలతో సరదా పడితే, పెద్దలు 1000 వాలాలతో, లక్ష్మీ బాంబులతో పోటీ పడతారు. ఇది ఒక చక్కని పండుగ. జాగ్రత్త లేకపోతే మాత్రం విషాదమే. వచ్చే సంవత్సరం మాత్రం ఈ పండుగ మరింత ఉత్సాహంగా చేసుకోవాలని ఆశిస్తున్నాను. అప్పటికీ మా ఇంట్లోకి ఒక క్రొత్త కుటుంబ సభ్యుడో / సభ్యురాలో వస్తారు. అప్పుడు మాత్రం ఈ తుఫాన్లు, వర్షాల భయాలు ఉండకూడదు. పంటలు బాగా పండాలి. దీపావళి కన్నా అందంగా సంక్రాంతి జరుపుకోవాలి. మీరు, నేను అందరం సంతోషంగా ఉండాలి.
దీన్ని మెచ్చుకోండి:
మెచ్చుకోండి వస్తోంది…
ఇలాంటివే
Sree vaasuki jee Let’s hope for the best.
” With Hearty Festival seaasons greetings to you n your family.” convey specially ..my cordial wishes to your little one too.. …Nutakki
By: Nutakki Raghavendra Rao on నవంబర్ 14, 2010
at 4:03 సా.
శ్రీవాసుకీ ,చాలా రోజుల తరువాత. …. క్షేమమా, బ్లాగ్ముఖంగా మీకు మరో పరి 2011 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. హితుడు….నూతక్కి
చిదానందంగా
అది చిచు బుడ్డే
కాని
చిందులేస్తూ
చివ్వున ఉవ్వెత్తున
ఎగురుతూ
చేసే హూంకార
ఊదర నాదం
నా కర్నాంతర్నాళాల
నాదమై ఓంకారమై
మార్మోగిన భావన
By: Nutakki Raghavendra Rao on జనవరి 2, 2011
at 3:10 సా.
రాఘవేంద్రరావు గారు
ధన్యవాదాలు. చాలా రోజుల తర్వాత కలిసాము.
By: శ్రీవాసుకి on జనవరి 3, 2011
at 1:15 సా.