వ్రాసినది: శ్రీవాసుకి | ఏప్రిల్ 15, 2010
నాకెందుకు ఈ మొహమాటం..!!
ఈ మధ్య జనాలకు బొత్తిగా ఇంగితం లేకుండా పోతోంది. బయటకు వచ్చినప్పుడు పాటించాల్సిన కనీస మర్యాదలు కూడా కొన్ని పాటించటలేదు. వాటిని భరించి భరించి ఇప్పుడిక చిరాకు వస్తోంది. మొన్నటి వరకు మొహమాటంగా ఉండేది అవతలివారు ఏమైనా అనుకొంటారేమోనని. కాని ఇప్పుడు అదే చిరాకుతో వాళ్ళ మొహం మీదే చెప్పేస్తున్నాను. ఆ రకంగా నేను నా మర్యాద తగ్గించేసుకొంటున్నానేమో. అయినా తప్పదు మరి. ఇంతకీ విషయమేమంటే భోజనానికి మెస్ కి వెళ్ళి అక్కడ చేయి కడుగుతుంటే ఇంతలో ఎవడో ఒకడు వచ్చేసి మధ్యలో చెయ్యి పెట్టేసి కడిగేస్తుంటాడు. ఏది ఒకప్రక్క మనది అవ్వకుండానే. అంత కంగారు దేనికో అర్థం కాదు. మనిషి చూస్తే ఇన్ షర్ట్ చేసుకొని శుభ్రంగా ఉంటారు. చేసే పనులిలా ఏడుస్తాయి. ఆ మాత్రం ఇంగితం ఎందుకుండదో వీళ్ళకి అర్థం కాదు. ఇకపోతే పెట్రోల్ బంక్ దగ్గర అందరం వరుసలో ఉంటే దర్జాగా ఏదోప్రక్క నుంచి వచ్చేసి బంక్ వాడితో రెండు మాటలు చెప్పేసి పెట్రోల్ పోయించుకొని చక్కా పోతారు. పోని ఆ బంక్ వాడైనా వరసలో రండని చెప్పడు. ఆ మాత్రం దానికి వరసెందుకో మన పిచ్చిగాని. ఇక మూడోది ఆఫీస్ నొప్పి. సాటి సహొద్యోగే కదా అని బండి అరువిస్తే ఊరంతా చక్కర్లు కొట్టి తిరిగొస్తారు. తీసుకొనేటప్పుడు ఏదో ఒక పననే చెబుతారు. తీరా చేతికి తాళం ఇచ్చాకా ఇక అంతే సంగతులు. ఎప్పుడో వస్తారు. పోని తిరిగితే తిరిగారు కనీసం పెట్రోల్ అయినా కొట్టిస్తారా అంటే అదీ లేదు. పళ్ళికిలిస్తూ తాళం తెచ్చి మన చేతిలో పడేసి థాంక్స్ బాస్ అనేసి పోతారు. వాళ్ళ అవసరం తీరితే చాలనుకొంటారు గాని మన గురించి ఆలోచించరు. ఒకవేళ బండికి ఏదైనా దెబ్బ తగిలితే ఆ మాటే చెప్పరు. ఎక్కడ బాగు చేయించమంటామో అని. అలా అని వీళ్ళు బయట చక్కబెట్టే రాచకార్యాలేమి ఉండవు. ఇలాంటి వారి వల్ల నిజంగా బండి అవసరం ఉన్నవాళ్ళకి కూడా ఇవ్వలేం. ఎందుకంటే అపనమ్మకం. ఒకచోట పనిచేస్తున్నాము కాబట్టి ఎవరెలాంటివారో తెలుస్తుంది ఆ రకంగా జాగ్రత్త పడాలి. ఇంకో తలనొప్పి ఎవడో మనకి ముక్కు మొహం తెలియని వాళ్ళ స్నేహితుడు డబ్బులు అప్పు కోసం వస్తే మనల్ని ఇబ్బంది పెట్టి బ్రతిమాలి మరీ మన డబ్బులే ఇప్పిస్తారు. నువ్వే ఇవ్వొచ్చు కదా అంటే ఇప్పుడు జేబులో సిద్ధంగా లేవని తప్పించుకొంటారు. ఆతర్వాత మన డబ్బులు మన దగ్గరకి రావడానికి నానాగచాట్లు పడాలి. వీళ్ళని అడిగామనుకోండి వాడు ఇంకా ఇవ్వలేదని చెబుతారు. అంతేగాని బాధ్యతగా అవతలవార్ని మాత్రం అడిగి తీసుకురారు. తీసుకున్నప్పుడున్న ఆత్రం ఇచ్చేటప్పుడు ఉండదు. ఏం మనుషులో ఏం చదువులు చదువుతారో అర్థం కాదు. ఎదుటివారి ఇబ్బందిని కొంచెం కూడా అర్థం చేసుకోకుండా ఎప్పుడు స్వార్ధం చూసుకొంటే ఎలా. అప్పుడనిపిస్తుంది నా మనస్తత్వానికి పడని ఇలాంటి వాళ్ళ మధ్యా బ్రతకాల్సి వస్తోందని. నేను కొంచెం నెమ్మది, మొహమాటం జాస్తి. కాని ఇప్పుడు విసుగొచ్చి అటువంటివారికి మెత్తగా మొట్టికాయలేస్తున్నాను. తప్పదు మరి. లేకపోతే ఓ బకరాగా జమకడతారు మరి. అంత భాగ్యం నాకవసరమా !!
దీన్ని మెచ్చుకోండి:
మెచ్చుకోండి వస్తోంది…
ఇలాంటివే
శ్రీ వాసుకి గారికి, నమస్కారములు.
ఉన్నమాట చెప్పారు. కత్తి – బకరా , ఈ రెండిటిలో , కొన్ని సార్లు బకారాగా వున్నా, కత్తిగా కూడా మనం మన నేపాధ్యాన్ని మార్చుకోవాల్సి వుంటుంది. తప్పదు మరి. లేకపోతే, మనల్ని బతకనివ్వరు.
భవదీయుడు,
మాధవరావు.
By: madhavaraopabbaraju on ఏప్రిల్ 15, 2010
at 10:27 ఉద.
@ మాధవరావు గారికి
నమస్కారములు. మీ స్పందనకు ధన్యవాదాలు. తప్పనిసరి పరిస్థితులలో మన కత్తిగా మారక తప్పదన్న మీ మాట నిజమే. లేదంటె అవతలివారు మనతో ఆడుకోరు మరి.
By: శ్రీవాసుకి on ఏప్రిల్ 15, 2010
at 10:36 ఉద.
వానపాములా ఉంటే తోకపట్టి ఆడిస్తారు.
నాగుపాములా ఉంటే దగ్గరికి రావడానికి భయపడతారు.
కానీ సమస్యల్లా ఎప్పుడెలా ఉండాలనేదే… 🙂
By: రవి చంద్ర on ఏప్రిల్ 15, 2010
at 12:04 సా.
@ రవిచంద్ర
మీరన్నది నిజమే ఎవరితో ఎప్పుడు ఎలా ఉండాలన్నది నాకెప్పుడు సమస్యే.. వీరిలో ఉపకారం పొందడమేగాక తిరిగి ఉపకారం చేసేవారుంటారు. కాకపోతే కొంతమంది మన అవసరాన్ని అలుసుగా తీసుకొంటారు. అదే ఇబ్బంది.
By: శ్రీవాసుకి on ఏప్రిల్ 15, 2010
at 2:11 సా.
సున్నిత మనస్కుల బాధలు చాలా బాగా చెప్పారు.ఇలా చెప్పుకున్నా మనం మారమేమో
సనారాజు
By: సనారాజు on ఏప్రిల్ 15, 2010
at 1:09 సా.
@ సనారాజు
వివేకంతో ఆలోచించి కొంతైనా మారితే చాలు. కాని అదే సమస్య.
By: శ్రీవాసుకి on ఏప్రిల్ 15, 2010
at 2:14 సా.
మొహమాటానికి పోతే ఏదో అయ్యిందని, ఈ రోజుల్లో అంత సున్నితంగా ఎవరుంటున్నారండీ?
ముఖ్యంగా నగరాల్లో ప్రాక్టికల్ గా ఉండక తప్పదు.
By: bonagiri on ఏప్రిల్ 15, 2010
at 1:39 సా.
@ బోనగిరి
మీరన్నట్టు నగరాల మాటేమోగాని చిన్న పట్టణాలలోను, గ్రామాలలోను ఈ తరహాగానే ఉంటోంది. మొహమాటం ఎక్కువే.
By: శ్రీవాసుకి on ఏప్రిల్ 15, 2010
at 2:17 సా.
Very good post. Nenu mohamaata padataaniki chaalaa mohamaata padataa.
🙂
Chandu
By: Chandu on ఏప్రిల్ 15, 2010
at 3:01 సా.
@ చందు
నిజంగా మొహమాట పడటానికి అంత మొహమాటం పడతారా. అయితే ఓసారి చూడాలి.
By: శ్రీవాసుకి on ఏప్రిల్ 16, 2010
at 4:34 ఉద.
డియర్ ! శ్రీ వాసుకి ,మనం సభ్య సమాజమనె ముసుగేసుకున్న సమాజంలొ వున్నాం. మనసుకు సభ్యత పొరలు కప్పబడి వుండటం వల్ల సంస్కారం, మొహమాటం, ఇత్యాది వన్నీ మనలో వున్న చొరవకు అడ్డు వస్తుంటాయి.
సహనం నసించినప్పుడు సభ్యత అనే పొరల్ని తొలగించుకొని బయటకు వస్తుంది.అప్పుడే మన సంస్కారానికి పరీక్ష.
మీరు ఇలా ప్రతి వ్యక్తి ఎదుర్కొనే సమస్యలను చర్చకు పెడుతున్నారు. బాగుంది. ప్రొసీడ్. అభినందనలతో శ్రేయోభిలాషి…… నూతక్కి
By: Nutakki raghavendra Rao on ఏప్రిల్ 16, 2010
at 7:28 ఉద.
@ రాఘవేంద్రరావు గారు
స్పందనకు ధన్యవాదాలు. నా వరకు నేనెదుర్కొన్న పరిస్థితులను తెలియజేసానంతే. అయితే అందరికి ఇలాంటివి ఎప్పుడొకప్పుడు ఎదురవుతూనే ఉంటాయి. చెప్పడానికి మొహమాటం కాదంటారా.
By: శ్రీవాసుకి on ఏప్రిల్ 16, 2010
at 12:48 సా.
వంద శాతం కరెక్ట్ అంటాను.
By: Nutakki Raghavendra Rao on మే 4, 2010
at 12:33 ఉద.
@రాఘవేంద్రరావు గారు
స్పందనకు ధన్యవాదాలు.
By: శ్రీవాసుకి on మే 4, 2010
at 1:50 సా.
Mee mohamatam chala bagundandi…
By: Balaji on ఏప్రిల్ 18, 2010
at 10:08 ఉద.
ఈ మీ పోస్ట్ రెండవ సారి చదివా ,కొళాయీ.పెట్రోలు బంక్కూ..పక్కవాడికి అప్పు..అన్నీ ఎక్కడయినా మన ప్రజల పద్దతి చాలా చండాలం గా వుంటుంది..మొహమాటమే కాదు మంచితనం కూడా వుండకూడదఏమో అన్న రోజులు వచ్చాయి…అసలు మన దేశంలోనేనా …ప్రజలు ఎక్కడైనా ఇలానే వుంటారా? ప్రపంచమ౦తా మనుష్యుల మనస్తత్యమ్ ఇంతేనా?అని నా బుర్రలో తోలుస్తూ వుండే ప్రశ్న..చివరకి దేముడి గుళ్ళో కూడా ముందు వాడిని తోసుకుని దాటి వెళ్ళి పోవాలనుకోవడం ఏమిటండీ? ఇంకో విషయం ఈ దరిద్రగొట్టు మనస్తత్వానికి చిన్నా పెద్దా అన్న తేడా కూడా లేదు..అందరూ ఒకటే…
By: kvsv on ఏప్రిల్ 18, 2010
at 12:42 సా.
@ kvsv గారు
మీరన్నది నిజమే. అన్నిచోట్ల కాకపోయినా కొన్నిచోట్లయిన జనాల పద్దతులు మారాలి. అన్ని వేళలా స్వార్ధంతో ఇతరుల్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు కదా.
By: శ్రీవాసుకి on ఏప్రిల్ 18, 2010
at 12:59 సా.
శ్రీవాసుకీ,
మొహమాటానికి పోయినా,ముక్కు సూటిగా పోయినా మొహం బద్దలయ్యే చాన్సెస్ ఎక్కువే యీ సమాజంలో. మొహమాటాలవల్ల ఎదుర్కొనే సమస్యలూ ఎక్కువే.యీ మధ్య మేము వ్యాహ్యాళికి వెళ్ళేపార్కులో పిల్లలు ఏవేవొ తినుబండారాలు తిని కాగితాలు అక్కడే పడేసారు. వాళ్ళను పిలిచి చెప్పాను…తీసి డస్ట్బిన్ లో వేయమని. వాళ్ళు వినలేదు. వాళ్ళ పేరెంట్సూ పట్టించుకోలేదు.నేనే వెళ్ళి అవి తీసి వేస్తుంటే అందులో ఓ చిన్న పాప …నేను తీసేస్తాలే తాతా అంటూ వచ్చింది.నాకు చాల ముచ్చటేసింది. ఆ ఇంగిత గ్నానం పెద్దవాళ్ళకు వుంటే……. ఒక సారి ఇలాగే ఎవరో తిని పారేసిన పొట్లం కాగితం పార్కులో కనబడితే తీసి చెత్త దబ్బాలో వేయడానికి వెళుతుంటే, అంకుల్ ఇక్కడకూడా వుంది ..అని ఒక పదిహేనేళ్ళ అమ్మాయి నా వైపు చూస్తూ,చెబుతా వుంది బిస్కెట్లు తింటూ తాను వేసిన బిస్కెట్ పొట్లాం చూపిస్తూ……..నా పరిస్తితి ఎలా వుండి వుండ వచ్చు ఎవరైనా చెప్ప గలరా….? అక్కడా మొహమాటానికి పోతే నెను మరింకెంత గా తప్పు చేసిన వాడినవుతాను?
By: manohar on ఏప్రిల్ 28, 2010
at 6:07 ఉద.
@ మనోహర్ గారు
మీ స్పందనకు ధన్యవాదాలు. మీ అనుభవం బాగుంది. మీలా మంచి చెప్పాలనుకున్నా లోకువవుతాం. పెద్దలు పిల్లలకు మంచి నేర్పితే అది తర్వాత వారి పిల్లలకు అందుతుంది. లేదంటే అంతే. చాలా చోట్ల పెద్దవాళ్ళని, తెలియనివారిని “మీరు” అనడం మానేసి “నువ్వు” అనడం మొదలుపెట్టారు.
నాకొచ్చిన మొత్తం కామెంట్లలో మీది 200వ కామెంట్.
By: శ్రీవాసుకి on ఏప్రిల్ 28, 2010
at 1:36 సా.