వ్రాసినది: శ్రీవాసుకి | ఏప్రిల్ 6, 2010

నా మామిడిచెట్టు జ్ఞాపకాలు..!!

వృక్షో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయని అర్థం. ఆ సూక్తి నాకు తెలియని వయసులోనే ఎంతో ఇష్టంగా ఒక మామిడి చెట్టు నాటాను. తెలుగునాట మామిడి ప్రాశస్త్యం తెలియనివారెవరు. ఏ ఇంటికైన శుభకార్యాల వేళ పండుగ శోభల్ని కూర్చి శుభ్రమైన గాలిని తోరణాల రూపంలో అందించేది మామిడాకులే కదా. అంతేనా తియ్యని రసాలతో మన నోరూరించదు. ఇక పుల్ల మామిడంటే ఆడవారికి ఎంతో ఇష్టం.

చిన్నప్పటి నుంచి నాకు మొక్కలంటే పిచ్చి. నా చిన్నప్పుడు హైస్కూల్ చదివే రోజులలో మా అమ్మమ్మగారి ఇంట్లో జామ, కొబ్బరి చెట్లుండేవి. మా ఊరు నుంచి అమ్మమ్మ ఇంటికి రెండు కి.మి. అందుకని సైకిల్ మీద శని, ఆది వారాలు వెడుతుండేవాడ్ని. ఒకసారి వేసవి కాలం సెలవులకి పిల్లలంతా అమ్మమ్మ ఇంటిలో ఉన్నప్పుడు మా నాన్నగారు తెచ్చిన రసం మామిడి పండ్లు తింటుంటే ఒక ఆలోచన వచ్చింది న్యూటన్ లాగా. మన ఇంట్లోనే ఒక చెట్టుంటే ఇలా కొన్నే కొనుక్కొని తినే బాధ ఉండదుగదా అనుకొని నేను తిన్న పండు తాలూకు టెంకని ఒక గొయ్యి తీసి కప్పేట్టేసాను. దానికి రోజు నీరు అందించాను. కొన్ని రోజుల ఎదురుచూపు తర్వాత చిన్న మొక్క మొలిచింది. దానిని చూసి బిడ్డను కన్న తల్లిలా మహానందపడిపోయాను. ఇక రోజు దాని గురించే ఆలోచన అది పెద్దదైపోయి పండ్లు కాసేస్తున్నట్టు కలలు. ఈలోపు వేరే వ్యాపకం ఏమంటే పూల మొక్కలు పెంపకం. కనకాంబరం, బంతి, బొండు మల్లి, గులాబి మొక్కలను పెంచేవాడ్ని. వేసవంతా వాటికి నీళ్ళు పోయడం, అందుకోసం చిన్న చిన్న కాలువలు త్రవ్వడం, మొక్కలు చుట్టూ ఇటుకలతో చిన్నపాటి అందమైన రక్షణ కల్పించడం ఇలా రోజువారి కార్యక్రమం నడిచేది. ఆ క్రమంలోనే ఇంట్లో వాళ్ళచేత తిట్లు తినడం కూడా. మొక్కలు కోసం నీళ్ళు తోడి, సామాన్లు తోమటం కోసం నీళ్ళు తోడేవాడ్ని కాదు. నా శ్రద్ధ, ఆసక్తి అంతా మొక్కలే మరి. పగలంతా క్రికెట్ ఆడటం, సాయంత్రం మొక్కల సేవ, ఆ తర్వాత మా వీధి చివరనున్న పెద్ద కాలువలో ఈతలు కొట్టి రావడం అంతా ఆనందకరమైన బాల్య జీవితం. మే నెల వస్తే కాలువలు కట్టేసేవారు. మళ్ళీ జూన్ తర్వాతే ధవళేశ్వరం బ్యారేజి నుంచి గోదావరి నీరు వదిలేవారు.

 

సరే కాలం గడుస్తోంది నేను ఎదుగుతున్నాను నాతోపాటే మామిడిచెట్టు కూడా. దానితోపాటు నా ఎదురుచూపులు తప్పలేదు. నేను కాలేజికొచ్చేసరికి అది 15 అడుగులపైనే పెరిగింది. వారం వారం దాని పోషణకి ఇబ్బంది లేకుండా చూసుకొంటున్నాను. చెట్టు పెరిగేకొద్ది అమ్మమ్మకి భయం కూడా పెరుగుతోంది. అది పెరిగి పెద్దదై ఇంటి మీదకొస్తుందేమో అని. పెంకుటిల్లు కదా. అప్పటికే కొబ్బరిచెట్లు వల్ల వంటింటి పైకప్పు కొద్దిగా దెబ్బతింది. నా చిన్నతనం ఆటలన్నీ పెరట్లో ఉన్న జామ చెట్టుపైనే సాగాయి. అప్పట్లో రామాయణ, మహాభారతం సీరియల్స్ ప్రభావం కారణంగా వెదురు కర్రతో విల్లు, బాణాలు తయారుచేసుకొని చెట్టు మీద నుంచి ఇంట్లో వచ్చిపోయే వాళ్ళ మీద సంధించి చీవాట్లు తినడం కూడా అలవాటే. అదో దిక్కుమాలిన సరదా మరి.

ఇవన్నీ ఎలా ఉన్నా అమ్మమ్మ మాత్రం 1996 తుఫాన్ తర్వాత ఆ రెండు కొబ్బరి చెట్లు ఇంటి మీద పడతాయన్న భయంతో నరికించేసారు. జామ చెట్టుని మాత్రం నా గురించి ఆపుచేసారు. అది మూణ్ణాల ముచ్చటే. ఉద్యోగం వెతుకులాట కోసం నేను హైదరాబాద్ వచ్చేసినప్పుడు జామచెట్టు కూడా ఇక సెలవంటూ వెళ్ళిపోయింది. తిరిగి నేను మళ్ళా వచ్చేసరికి అక్కడంతా బోడిగా దర్శనమిచ్చింది. నా చిన్ననాటి నేస్తాలు ఇక లేవని తెలిసినపుడు మనసేదోలా అయిపోయింది. ఇక మామిడిచెట్టు జోలికి వస్తారేమో అని భయపడి దాన్నేదైనా చేస్తే నన్ను కొట్టినట్టే అని రకరకాల సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పి ఒప్పించాను. ఎందుకంటే అది కూడా తన కొమ్మరెమ్మలను ఇంటి వైపుగా పెంచుకొంటూ వస్తోంది మరి. ఇష్టం లేకపోయినా కొన్ని కొమ్మల్ని నరకడానికి ఒప్పుకొన్నా అమ్మమ్మ భయం పొగొట్టడానికే ఆ నిర్ణయం. అయినా ఆవిడ దృష్టి ఆ విషయం నుంచి మరలిపోలేదు. మా మావయ్య రోజూ ఈ చెట్టు మొదలు దగ్గర స్నానం చేసేలా ఒప్పందం కుదుర్చుకొన్నాను. మరి దానికి ఆహారం కావాలి కదా. అడపాదడపా నేను ఫోన్ చేసి అందరి యోగక్షేమాలతోపాటు మామిడిచెట్టు క్షేమ సమాచారాలు తెలుసుకొనేవాడ్ని. ఎందుకో అదంటే ఒకరకమైన గాఢమైన అభిమానం, అనుబంధం ఉండేది.

 

మరో సంవత్సరం గడిచాకా మామిడిచెట్టు పెద్ద మనిషి అయ్యింది. అదేనండీ పూతపూసింది, కాయలు కాచింది. ఈ విషయం మా మావయ్య నాకు ఫోన్ చేసి చెప్పారు. చెప్పలేనంత ఆనందం కలిగింది. నేను పెంచిన చెట్టు 110 కాయలు కాసింది అన్న ఆలోచన నాలో ఎంతో ఉత్సాహాన్ని నింపింది ప్రయోజకుడైన కొడుకుని చూసి తండ్రి పొందిన పుత్రోత్సాహంలా. నరుకుతా, పీకుతా అన్న అమ్మమ్మ కూడా మామిడికాయల మహత్యానికి సంబరపడి వాటిని కోసి దగ్గరి బంధువులకి, ఇరుగుపొరుగు వారికి మా మనవడు వేసిన చెట్టు కాయలంటూ పంచింది. ఇవన్నీ తెలిసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను. వాళ్ళకి కుదిరినంతలో చెట్టు గురించి జాగ్రత్తలు తీసుకునేవారు. మావయ్య పిల్లలు దానికి ఊయల కట్టుకొని ఊగేవారు. తర్వాత జీవనపోరాటంలో భాగంగా ఉద్యోగం, పెళ్ళి, పిల్ల బాధ్యతలలో పడి ఊరు వెళ్ళడం కుదిరేదికాదు. అయినా ఆలోచనలు చెట్టు చుట్టూ ఉండేవి.

ఒక విషాదమేమంటే మొన్న డిశెంబర్ నెలలో అమ్మమ్మ కాలం చేసింది. అప్పుడు ఆమె భౌతికకాయాన్ని ఆ మామిడిచెట్టు క్రిందే పడుకోబెట్టారు. అలా ఆవిడ జీవితపు ఆఖరి మజిలీ తను నరికిపారేస్తానన్న చెట్టు కింద నుంచే ప్రారంభం అయింది. ఆ పదిరోజులు చూడటానికి వచ్చిన వారందరు దాని నీడనే సేదతీరారు. ఇప్పుడు అక్కడ ఇంటికి పెద్ద దిక్కైన అమ్మమ్మ లేదు, మావయ్యలు ఉద్యోగరీత్యా అక్కడ ఉండడం లేదు. ఇల్లు ఎవరూ లేని అనాధ అయింది దానితోపాటే నా ప్రియనేస్తం మామిడిచెట్టు కూడా ఒంటరయింది. మరి అది నా కోసం ఆలోచిస్తుందో లేదో. మళ్ళీ ఎప్పుడు కలుస్తానో. దానిని నా కూతురికి చూపించాలి మా ఇద్దరి స్నేహం గురించి చెప్పాలి. నన్ను పిచ్చివాడనుకున్నా ఫర్వాలేదు. అదో పిచ్చి నాకు.


Responses

 1. >>మా మావయ్య రోజూ ఈ చెట్టు మొదలు దగ్గర స్నానం చేసేలా ఒప్పందం కుదుర్చుకొన్నాను. మరి దానికి ఆహారం కావాలి కదా.
  >>ఇల్లు ఎవరూ లేని అనాధ అయింది దానితోపాటే నా ప్రియనేస్తం మామిడిచెట్టు కూడా ఒంటరయింది. మరి అది నా కోసం ఆలోచిస్తుందో లేదో. మళ్ళీ ఎప్పుడు కలుస్తానో.
  చాలా బాగా రాసారండీ.సరదాగా కూడా వుంది,అలాగే కొన్ని దగ్గరల హృదయానికి హత్తుకునేటట్టుగా కూడా వుంది.

  • @కృష్ణగారు,
   మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ. నిజంగా నాకు ఆ చెట్టంటె చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. ఉద్యోగరీత్యా దూరంగా ఉండడం వల్ల చూడటం సాధ్యపడటలేదు.

 2. bagundi.
  enduku pichhivadanukuntaru, emi anukoru. nakukuda chala ishtam mokkalu penchadam, place ye ledu penchadaniki endukante apartment lo untamu kabatti 😦

  • @స్వప్న గారు,
   మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ. ఒక దాని మీద ఇష్టం పెంచుకుంటే అది పిచ్చిగా మారవచ్చు. అప్పుడు మనల్ని చూసి పిచ్చివాడనే అనుకొంటారు. ఏమనుకున్నా మన ఇష్టం మనది. మన తపనని అవతలి వారు గుర్తిస్తే చాలు. మీ బ్లాగ్ చిరునామా ఇవ్వగలరా.

 3. భలేగా రాశారండీ. కృష్ణగారు చెప్పినట్లు హాస్యంగానూ, హత్తుకునేట్టుగానూకూడా రాశారు. నాక్కూడా మొక్కలంటే ప్రాణం. చిన్నప్పుడు మేమున్న రైల్వే క్వార్టర్స్లో ఇలాగే నేరేడు, బాదం, సీమ చింత, జామ మొక్కలు పెంచాను. మామిడి మొక్క పెంచాలని ఎంతో ప్రయత్నించినా ఎందుకనో పాతిన మొక్కలేవీ బతకలేదు. పుచ్చకాయలు కూడా కాయించానండోయ్, మా ఇంట్లో వాళ్ళంతా అబ్బురంగా చెప్పుకున్నారు ఆ సంగతి 🙂 ఇంతాచేసి జామ కాయలు మాత్రం రుచి చూడగలిగాను. మిగతావి పెద్దయ్యి కాయలు కాసేటప్పటికి మేం ఆఊరు వదిలి వచ్చెయ్యాల్సొచ్చింది. ఎప్పటికైనా ఒక ఎకరమైనా పొలం కొనుక్కుని అందులో నాక్కావలసిన మొక్కలన్నీ పెంచుకుంటూ మధ్యలో ఒక కుటీరం నిర్మించుకుని అందులో ఉండాలని ఓహ్! ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టున్నా, ఇక ఉంటా 🙂

  • @బ్లాగాగ్ని గారు

   మీ స్పందనకు ధన్యవాదాలు. నా బ్లాగ్ దర్శించినందుకు కూడా. ఓహ్ మీ ఆలోచనలు సూపర్ గా ఉన్నాయి.చుట్టూ చెట్లు మధ్యలో కుటీరం బాగుంది. మీరు నా తరహా ప్రాణే అన్నమాట. నాకు ఇలాంటి ఆలోచనలు చాలా ఉన్నాయి. కాని అవి కలలోనే సాధ్యం. పోనిలెండి మీ పేరు చెప్పుకొని ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వాటిని తింటారు. అవే మీకు దీవెనలు.

 4. నాకూ ఇష్టమే మొక్కలు, చెట్లు అంటే…
  వాటితో సాయంత్రాలు మాట్లాడుతుంటాను అప్పుడప్పుడు.

  • @పద్మర్పిత గారు

   మీ స్పందనకు ధన్యవాదాలు. నా బ్లాగ్ దర్శించినందుకు కూడా. మరి మీరు మొక్కలతో ఆడే ఆ ఊసులు మాతో పంచుకోవచ్చు కదా.

 5. “వృక్షో రక్షతి రక్షితః “. ఇది చాలా నిజమండి.
  ఇక పోతే మీ నేస్తం ( మామిడి చెట్టు ) కథ హృదయానికి హత్తుకునేట్టుగా ఉంది.

 6. >> అప్పట్లో రామాయణ, మహాభారతం సీరియల్స్ ప్రభావం కారణంగా వెదురు కర్రతో విల్లు, బాణాలు తయారుచేసుకొని చెట్టు మీద నుంచి ఇంట్లో వచ్చిపోయే వాళ్ళ మీద సంధించి చీవాట్లు తినడం కూడా అలవాటే. అదో దిక్కుమాలిన సరదా మరి.

  Nenu, maa chellelu ilaa ne chesevaallam. Kaakapote cheepuri pullalatho chesevaallam.

  Nenu, maa chelli, babai maa intlo 2 kobbari chetlu, oka jaama chettu, parijaatham mokkalu, ganneru, mandaara mokkalu devataarchana kosam vesam. Naaku ee sanghatanalu mee valana gurtukotchai. Thanks.

  Chaalaa baagundandi ee post. Ammamma gaaru kaalam chesaranna line kashtam kaliginchindi. 😦

  Mee intiki, chettu ki ippudu evaroo lerani baadha padaddu. Mee illu mee prathee tharam gurinchee aa maamidi chettu ki kathalu kathalu gaa cheptundi lendi. Baadha padaddu. 🙂 🙂

  Nice post.
  Chandu

  • @చందు గారు

   మీ అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదాలు. నా అంతరంగ జ్ఞాపకాలలో ఇదొకటి. తరచు గుర్తొస్తుంటుంది. అమ్మమ్మ అంటే చిన్నప్పటి నుంచి అభిమానం. ఎటాచ్మెంట్ ఎక్కువ.

 7. శ్రీ వాసుకి గారికి, నమస్కారములు.

  కొన్ని,కొన్ని చిన్ననాటి కోరికలు, జ్నాపకాలు మనం పెద్దవాళ్లం అయినప్పటికీ మన మనసులో అలాగే గుర్తుండిపోతాయి. అవి గుర్తుకువచ్చినప్పుడు మానసికంగా మనం చిన్నవాళ్లం అయిపోతాము .ఆనందాన్ని అనుభవిస్తాం. అయితే, తెలిసీ,తెలియని వయసులోకన్నా, పెద్దవాళ్లమయిన తరువాతే ఈ అనుభూతి అనిర్వచనీయమైనదిగా తెలుసుకుంటుంటాము.
  నా చిన్నప్పటి ఇటువంటి జ్నాపకం గుర్తుగా , నా బ్లాగులో , సాహిత్యం వర్గములో ” బాదం చెట్టు ” అనే ఒక కవిత , 12-5-2009 నా వ్రాశాను. వీలుంటే చదవండి. ఏది ఏమైనా, చక్కటి అనుభూతిని కలిగించే “జ్నాపికను” అందించారు.
  భవదీయుడు,
  మాధవరావు.

  • @ మాధవరావు గారు
   మీ అభిమానపూర్వక స్పందనకు ధన్యవాదాలు. మీరన్నది నిజమే చిన్నతనపు చేష్టలు మలి వయసు జ్ఞాపకాలుగా ఉంటాయి. అవి గుర్తుకొచ్చినప్పుడు తెలియని ఆనందం, ఉల్లాసం కలుగుతుంది.

 8. మీ మామిడి చెట్టు అనుభుతూలు ఎంత చక్కగా చెప్పారండి .. ” నా ప్రియనేస్తం మామిడిచెట్టు కూడా ఒంటరయింది. మరి అది నా కోసం ఆలోచిస్తుందో లేదో. మళ్ళీ ఎప్పుడు కలుస్తానో. దానిని నా కూతురికి చూపించాలి మా ఇద్దరి స్నేహం గురించి చెప్పాలి.”.. మీ కోరిక తప్పక నెరవేరాలని..

  • @ నెలబాలుడు గారు
   మీ స్పందనకు ధన్యవాదాలు. మీ అనుభూతులు కూడా మాతో పంచుకోండి. ఆనందిస్తాం.

 9. ఇవాళ మీ బ్లాగు టపాలన్నీ చూశాను. బాగా రాస్తున్నారు. మాదీ కోనసీమే!! మీ టపాలు కొన్ని నా చిన్నప్పటి జ్ఞాపకాల్లాగే ఉన్నాయి.

  • @ నాగ మురళీ గారు
   మీ స్పందనకు ధన్యవాదాలు. అయితే మనం లంక కుర్రాళ్ళమన్నమాట. ఇంతకూ కోనసీమలో ఉండేదెక్కడ

 10. డియర్ శ్రీ వాసుకి,నైస్ సబ్జెక్ట్. మీ కోరిక …దానిని నా కూతురికి చూపించాలి మా ఇద్దరి స్నేహం గురించి చెప్పాలి. నన్ను పిచ్చివాడనుకున్నా ఫర్వాలేదు. అదో పిచ్చి నాకు….ఇది పిచ్చేమీ కాదు. అది బలీయమైన అభిలాష.
  చెట్లపెంపకంపై అవగాహన కలిగించి,చెట్లతో అనుబంధాన్ని కలిపించేందుకే స్కూళ్ళల్లో గార్డెనింగ్ క్లాసులు నిర్దేశించేవారు.ఆ కాలాలలో మేం పండించిన కూరగాయలు,వూరులో అమ్మి ఆ డబ్బు తెచ్చి చీడ మందులు పరికరాలు తెచ్చే వారం.అలా మా హెడ్మాష్టారు నిర్దేసించారు మరి. పేడ ఎరువుకు వూర్లో కరువులేదనుకోండి. బాగా మాగిన ఎరువు ఏ రైతును అడిగినా తోలే వారు.గార్డెనింగు కొరకు వున్న స్థలాన్ని చిన్న చిన్న కమతాలుగా నలుగురుకి ఒకటిగా ఎలాట్ చేసేవారు.మా గ్రూప్ పండించిన కూరలకు
  మంచి గిరాకీ వుండేది. వాళ్ళు మార్కెట్ రేటు కన్న ఎక్కువ ధరకు కొనుగోలు చేసే వారు. కూరలపెంపకంలొ చిన్న చిన్న తగాదాలూ, ఈర్ష్యలూ అసూయలూ ఒకళ్ళ కూరగాయలు మరొకళ్ళు కోసి దూరంగా పడేయడాలూ,లేకుంటె వాళ్ళ కూరలతో కలిపి అమ్మడాలూ…దీన్ని చూసి మా మేష్టారికి ఒక సలహా యిచ్చా…..ఒక్కో గ్రూపు ఒకే రకం కూరగాయ పండించాలి్ అని.ఇప్పుడు మరో సమస్య .కొన్ని రకాల కూరగాయలకు ఎక్కువ ఆదాయం వచ్చేది .కొన్నిటికి తక్కువ.స్కూలు పీపుల్ లీడర్ గా అందరికీ సర్దిచెబుతూ ఎలాగో వ్యవహారం సర్దుకు పోయే వాడిననుకోండి.,మేం టెంక పెట్టి పెంచిన చిన్న రసాలమామిడి చెట్టు యిప్పటికి ఆ స్కూలు ఆవరణలో కొత్తగా కట్టిన భవనాలకు అడ్డం రాకుండా…అప్పటి మా హెడ్మాష్టర్ గారి దూరద్రుష్టికి యిప్పటికీ శిరసానమామి.
  ఏ కార్యం తలపెట్టినా ప్రణాళికా బద్ధంగా ఎలా చేయాలో ఆయన నుండి నేర్చుకున్నాం.
  ఏపని చేయాలన్నా ఆయనను సంప్రదించే వాడిని. ఆ రోజు మామిడి చెట్టు విత్తనం విషయం చెప్పినప్పుడు,మమ్మల్ని చిన్నబుచ్చకుండా, ఒక స్థలాన్ని చూపెట్టి యిక్కడ పెట్టండి అన్నారు. ఆ స్తలం మాకు నచ్చలేదు. అక్కడే ఎందుకని మేమ్ అడిగాం. ఆయనన్నారూ..స్కూలుకుకొత్త రూములు కట్టాలన్నా, ఆటస్థలాలుకు గానీ, అసెంబ్లి స్థలం పెంచినప్పుడు కానీ యీ చెట్టు తియ్యవలసిన అవసరం వుండదు కదా అన్నారు.ఇప్పటికీ మర్చిపోలేని సంఘటన అది.
  అలా మనం మన టీచర్ల నుండి, పెద్ద వారినుండి వారి వారి చర్యలనుండి ఎన్నెన్నో విషయాలు నేర్చుకొని వుండి వుంటాము కదా.మన పిల్లలకూ, మనవళ్ళకూ నేర్పితే…..శ్రేయోభిలాషి …నూతక్కి

  • రాఘవేంద్రరావు గారు

   నమస్కారం. మీ అభిమానపూర్వక స్పందనకు ధన్యవాదాలు. అయితే మీకు చెట్లతో అనుబంధం ఉందన్నమాట. బాగున్నాయి మీ స్కూల్ అనుభవాలు. మేము చిన్నప్పుడు స్కూల్లో చదివే రోజులలో క్లీన్ అండ్ గ్రీన్ పాటించాము. ఆ కార్యక్రమ సారధులు మా తెలుగు మాస్టారు. చెట్లు పెంచడం అంటే భవిష్యత్ తరాలకు ఆరోగ్యం అందివ్వడమే అని నా భావన.

 11. పైన అందరు చెప్పినట్లు, సరదాగా అలానే అక్కడక్కడా హృదయానికి హత్తుకునేలా చాలా బాగా రాశారండీ.

  • @వేణు శ్రీకాంత్ గారు

   మీ స్పందనకు ధన్యవాదాలు. అలాగే నా బ్లాగ్ దర్శించినందుకు కూడా.

 12. శ్రీ వాసుకి గారు ,

  చదువు తుంటే కళ్ళ ముందుకనిపిచినట్లు ఉంది ..నాకు కుడా మీ మామిడి చెట్టు చడాలి అన్పిస్తోంది ….. నా ప్రియనేస్తం మామిడిచెట్టు కూడా ఒంటరయింది. మరి అది నా కోసం ఆలోచిస్తుందో లేదో. మళ్ళీ ఎప్పుడు కలుస్తానో. దానిని నా కూతురికి చూపించాలి మా ఇద్దరి స్నేహం గురించి చెప్పాలి.”.. మీ కోరిక తప్పక నెరవేరాలని..nice post.

  హేమ

  • @ హేమ గారు

   నా బ్లాగ్ దర్శించినందుకు, మీ స్పందనకు ధన్యవాదాలు. తరచు వస్తూ ఉండండి.

 13. Naa Heart ni touch chesarandi…..

 14. నమస్కారమండీ, రవిచంద్ర గారి బ్లాగ్ చూస్తున్నప్పుడు మీ పేరు కనిపించింది.”శ్రీవాసుకి” అన్న పేరు చక్కగా అనిపించి మీ లింక్ ని చూడడం జరిగింది. ఒక టపా చూసాను “హమ్మయ్య నేను సినిమా కి వెళ్ళాను” అన్నది…బాగుంది అండి.ఈ రోజు పాత టపాలని చూస్తుంటే మీ ” నా మామిది చెట్టు ఙ్ఞాపకాలు” టపా ని చదివాను.వెంటనే స్పందన ని పంపించాలనిపించింది. చక్కగా వివరించారు… మీ చిన్న నాటి నేస్తాల గురించి చాలా బాగా చెప్పారు…కొన్ని వాక్యాలు హృదయముని హత్తుకుంటే మరికొన్ని
  సరదాగా ఉన్నాయి. చివరగా మీ అమ్మమ్మ గారి జీవితపు ఆఖరి మజిలీ ఆ చెట్టు కిందే నుంచే ప్రారంభం అయ్యిందని చెప్పారు..ఇప్పుడు మీ నేస్తం ఒంటరి అయ్య్యిందెమో అన్న మీ బెంగ,మీరు మళ్ళి కలుస్తానో లేదో అన్న మీ ఆరాటం , మీ అమ్మాయికి దాన్ని చూపించాలన్న మీ తపన చాలా బాగుంది అండి. అలాగే మీ అమ్మయికి మీ నేస్తాన్ని పరిచయం చేసి తనకి ఒక నేస్తాన్ని ఇవ్వండి …తన చేత ఒక్క మొక్కని నాటించండి …
  “వృక్షో రక్షతి రక్షతః”

  • @ స్నిగ్ధ గారు

   నా బ్లాగ్ దర్శించినందుకు, టపాలు నచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. తప్పకుండా మా అమ్మాయిచేత మొక్క నాటిస్తాను. ఆ ప్రణాళిక కూడా సిద్ధమయింది.

 15. sir, me mamidi chettu gurunchi chadivaki naku chala santosham vesindi. ammamma valla intilo gadipina rojulu gurthuku vachhai. chala thanks sir aarojulanu nidralepinanduku

  • లక్ష్మి గారు

   మీ అభిమానపూరిత వ్యాఖ్యలకి, బ్లాగ్ దర్శించినందులకు ధన్యవాదాలు. నేను రాజమండ్రిలో ఉద్యోగం చేస్తున్నా. మాది దగ్గరలోనే ఉన్న వడిశలేరు గ్రామం.

 16. శ్రీ వాసుకి గారూ..
  మీ బ్లాగును ఇప్పుడే చూసాను. సరిగ్గా సంవత్సరం క్రితం రాసిన మీ మామిడిచెట్టు జ్ఞాపకాలను చదివాను. చాలా బాగా రాసారు. చిన్నప్పటి జ్ఞాపకాలను మనసులో నెమరువేసుకోవడం కాక పదిమందికీ నచ్చేవిధంగా, వారికి కూడా వారి చిన్నతనాన్ని గుర్తొచ్చే విధంగా పంచుకోగలిగినట్టుగా బాగా రాసారు.
  అభినందనలు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: