వ్రాసినది: శ్రీవాసుకి | మార్చి 14, 2010

ఓ అభిమాని గోడు-4….హంపి యాత్ర

      బ్లాగ్ మిత్రులు అందరికి వికృతనామ ఉగాది శుభాకాంక్షలు.

ఉదయాన్నే మా ఊరు నుంచి విజయవాడ వెళ్ళే బస్సు ఎక్కాను. నాలుగు గంటల ప్రయాణం తర్వాత బెజవాడలో దిగి రైల్వే స్టేషన్ కి వెళ్ళాను. అక్కడ అమరావతి-వాస్కోడిగామా వెళ్ళే రైలెక్కాను. ఒక రాత్రంతా ప్రయాణం. కూర్చున్నది సామాన్య తరగతిలో, నిద్రపోయే అవకాశం లేదు. బుర్రలో బొంగరంలా తిరుగుతున్నాయి రకరకాల ఆలోచనలు జాకీచాన్ ని ఎలా కలవాలి, కలిస్తే ఏమి మాట్లాడాలంటూ. మనకేమో ఇంగ్లీష్ పెద్దగా రాదు. పక్కా తెలుగు మాధ్యమం మరి. ఇన్ని ఆలోచనల మధ్య ఎప్పుడు నిద్రపట్టిందో తెలీదు. లేచేసరికి ఆరయింది. అప్పటికి రైలు బళ్ళారి దగ్గరకి వచ్చింది. ఇంక చూసుకోండి మనకి ఒకప్రక్క ఆతృత, మరోప్రక్క ఆనందం. మరికొంత సమయానికి రైలు హోస్పేట్ చేరుకుంది. నేను దిగాల్సింది ఇక్కడే. నెమ్మదిగా స్టేషన్ బయటకు వచ్చి బస్టాండ్ ఎదురుగా ఉన్న ఒక లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాను.  త్వరత్వరగా స్నానాదికాలు పూర్తిచేసుకుని ప్రక్కనే ఉన్న హోటల్లో కన్నడ సాంబారిడ్లీ తిని హంపి వెళ్ళే బస్సులో కూర్చున్నాను. ఒకప్రక్క మనసులో కందరీగ రొదలా ఒకటే ఆలోచనలు.

ఒక అరగంట ప్రయాణం తర్వాత హంపిలోని విరూపాక్ష ఆలయం దగ్గర బస్సు ఆగింది. దిగి గబగబా వెళ్ళి టికెట్ తీసుకొని లోనికెళ్ళాను. వాతావరణమంతా ప్రశాంతంగా ఉంది. నిదానంగా స్వామి దర్శనం చేసుకొని ఆలయ మండపం బయటకు వచ్చి మేనేజ్మెంట్ వార్ని జాకీచాన్ షూటింగ్ గురించి అడిగితే వాళ్ళు నిన్న సాయంత్రమే షూటింగ్ అయిపోయి జాకీచాన్, నేను అక్కడ దిగిన ప్రొద్దునే హాంకాంగ్ వెళ్ళిపోయిన విషయం చెప్పారు. నాకొక పెద్ద షాక్. బుర్ర తిరిగింది. ఇంత ప్రయాస పడి వస్తే ఇలా జరిగిందేమిటబ్బా అని మనసులో బాధ. కాసేపు అక్కడే కూర్చుండిపోయాను. మళ్ళీ రకరకాల ఆలోచనలు వెంటనే వెనక్కి వెళ్ళిపోదామనిపించింది. అలా అనుకొని బయటకు వచ్చి ప్రక్కనే ఉన్న కొట్టులో ఇంగ్లీష్ పేపరొకటి కొని చదివాను. అందులో నిన్న సాయంత్రంతో 15 రోజుల షూటింగ్ అయిపోయిందని, ఈరోజు ఉదయమే 6 గం.ల విమానానికి జాకీచాన్ వెళ్ళిపోయాడని  అది చదవగానే మనసు ఉసూరుమనిపించింది. ఇంటికి ఫోన్ చేసి విషయం చెబితే వాళ్ళు బాధపడ్డారు. బయలుదేరి వచ్చేయమన్నారు. సరే అని ఫోన్ పెట్టేసా.

ఆతర్వాత కాసేపు ఆలోచించి నేను వచ్చింది దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికిన రాయల వారింటికి కదా  అనుకొని ఆ చుట్టుప్రక్కలంతా చూడాలని నిర్ణయించుకొన్నాను. ఆరకంగా నా బాధ కూడా మర్చిపోవచ్చు కదా. ఆ ప్రదేశాలన్ని చూపించడానికి ఒక ఆటో మాట్లాడుకున్నాను. ఒంటికాయ సొంఠికొమ్ములా నేనొక్కడ్నే ఆటోలో చక్కర్లు మొదలెట్టా.  జాకీచాన్ షూటింగ్ ఎక్కడెక్కడ జరిగిందో అవన్నీ చూపించాలని ఆటో అబ్బాయికి ముందే చెప్పా. అదిగో అలా ప్రసిద్దమైన హజారరామ దేవాలయం, కమల మందిరం (మహారాణి అంతఃపురం), ఆనెగొంది, మణులు మాణిక్యాలు రాశులుగా పోసి అమ్మిన బజారు తుంగభద్ర నది సమీపంలోనే ఉంది. ఇంకా విజయవిఠల్ ఆలయం. ఇక్కడ స్తంభాలాన్నీ సప్తస్వరాలు పలుకుతాయి. మనం వాటిని కొట్టి చూడవచ్చు. కాని ఏ ఆలయంలోను విగ్రహాలు లేవు. కృష్ణదేవరాయల మరణాంతరం ఇవన్నీ కూడా ముస్లింల దండయాత్రలో నాశనం చేయబడ్డాయి. తళ్ళికోట వద్ద జరిగిన ఘోరయుద్ధంతో విజయనగర సామ్రాజ్య వైభవం గతించింది. ఇంకా నవమి దిబ్బ రాయలు వారు ఏ యుద్ధలో విజయం సాధించిన దాని గుర్తుగా ఒక నిర్మాణం చేసేవారు అలాంటిదే ఈ నవమి దిబ్బ.విశాలమైన,చదునైన దీర్ఘచతురస్రాకారపు రాతి కట్టడమిది. ఇక్కడ దసరా ఉత్సవాలు జరిగేవట. దానికి దగ్గరలోనే శ్రీచక్ర ఆకారంలో లోపలికి నల్ల మెట్లు కలిగిన చెరువు. దీని ద్వరా వారు త్రాగు నీరు రాతి గొట్టాల ద్వారా నగరంలోకి పంపేవారు. అవన్నీ మనం అక్కడ చూడొచ్చు. తుంగభద్ర నది దాటితే అవతల ప్రక్క ఉండేది ఆనెగొంది. విజయనగరం యొక్క పాత రాజధాని. తర్వాత రాయల కాలంలో అనుకొంటా దానిని హంపికి మార్చారు. చిరుతిళ్ళు తింటూ ఇంకా ఇతర దేవాలయాలు, ప్రదేశాలు కూడా చుట్టబెట్టేశాను. తిరిగి 5 గం.ల కు విరూపాక్షాలయం దగ్గరికి వచ్చి హోస్పేట్ వెళ్ళే బస్సు ఎక్కాను. ఈ విరూపాక్ష ఆలయంలో మాత్రం ఈనాటికి శివలింగానికి పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి. ఎందుచేతనో మొఘలు రాజులు దీని జోలికి రాలేదు.

సరే హోస్పేట్ లో దిగిన తర్వాత ఇంకా ఏదో భ్రమ తీరక అక్కడున్న ఆటో అతన్ని జాకీచాన్ ఏ హోటల్లో ఉండేవాడో అడిగి అక్కడికి వెళ్ళాను. దాని పేరు మల్లిక్ మరేదో గుర్తులేదు. రిసెప్షన్ దగ్గర నన్ను పరిచయం చేసుకొని నా దగ్గరున్న జాకీచాన్ సభ్యత్వ కార్డ్, ఫోటోలు చూపిస్తే వాళ్ళూ లోపలికి పంపించారు. అక్కడ ఇంకా సినిమా సిబ్బంది ఉన్నారు. వాళ్ళని పరిచయం చేసుకొని నా వచ్చీరాని ఆంగ్ల భషలో జాకీ “ది మిత్” సినిమా వివరాలు అడిగి కాసేపు నాలో నేను సంతోషపడి కొద్దిపాటి ఆనందం, బాధ కలగలిపిన ముఖంతో బయటకు వచ్చేసాను. అక్కడ నుంచి తాపీగా నడుచుకొంటూ రూం కొచ్చి స్నానం చేసి మంచం మీద పడ్డాను. ఇంతలో కడుపు కాలి మళ్ళా బయటకు వెళ్ళి కొద్దిగా మేసి ఇంటికో ఫోన్ కొట్టి ఇటునుంచి హైదరాబాద్ వెడుతున్న విషయం చెప్పాను. గదికొచ్చి నిద్రపోబోతే అన్నీ అవే ఆలోచనలు. అనుకున్న వ్యక్తిని చూడలేకపోయానని ఒకప్రక్క, అనుకోనిరీతిలో హంపిని చూడగలిగానని మరోప్రక్క బాధానందం. ఏంచేస్తాం కొన్నిసార్లు అంతే. ఇదేమి జీవన్మరణ సమస్య కాదు అంత ముఖ్యము కాదు అయినా ఇప్పటికీ అదో ఎడతెరిపిలేని ఆలోచనతో కూడిన బాధ ఓ మంచి జ్ఞాపకం కోల్పోయాను కదా అని. ఆ వయసుకి అదొక ఆనందం. ఇప్పుడు తలుచుకొంటే ఆ సరదాలు, ప్రయాసలు నవ్వు తెప్పిస్తాయి. ఇప్పుడు నా జ్ఞాపకాలు జాకీచాన్ దగ్గరి నుండి వచ్చిన ఉత్తరాలు, ఆటోగ్రాఫ్ ఫోటోలు అలానే ఉన్నాయి నాకేసి చూసి నవ్వుతున్నట్టుగా.

(అయిపోయింది)

*మీ కోసం నాకొచ్చిన జాకీచాన్ ఫోటోలు ఇక్కడ పెడుతున్నాను . వాటి మీద జాకీచాన్ స్వహస్తంతో చేసిన సంతకం, నా పేరు ఉంటాయి* చూడండి.


Responses

 1. జాకీచాన్ ని కలవాలన్న మీ ప్రయత్నం, తత్పరిణామాలు, మీ అనుభవాలు చక్కగా చదవదగ్గ రీతిలో బాగా వర్ణించారు. ధన్యవాదాలు. 🙂

  • రాహుల్ గారు మీ అభిమానానికి, బ్లాగ్ దర్శించినందుకు మీకు ధన్యవాదాలు. నా ప్రయత్నం ఒక కలలా మిగిలిపోయింది. ఇదిగో ఇలా అప్పుడప్పుడు గుర్తుచేసుకొంటూ ఉంటాను.

   • తీరని కలల ఙాపకాలని నెమరువేసుకోవడం ద్వారా ఆ కల తీర్చుకోవడానికి మనం పడ్డ తపన ఎప్పటికీ తీపి గుర్తే. 🙂 మున్ముందు కలలని నిజం చేసుకొవడానికీ, ఏ దశలోనూ వదులుకోకుండా జాగ్రత్త పడటానికి కూడా పరిస్థితులని సమీక్షించుకునే అవకాశం ఉంటుంది. ఈసారి మాత్రం మీరు ఖచ్చితంగా జాకీచాన్ ని వదిలేలా లేరు. ఆల్ ది బెస్ట్. 🙂

    • ముందుగా మీకు ధన్యవాదాలు. జాకీచాన్ దశావతారం ఆడియో ఫంక్షన్ కి రెండోసారి చెన్నై వచ్చినప్పుడు నాకు వెళ్ళాలనిపించలేదు. ఒక్కరోజు కోసం ప్రయాస పడాలనిపించలేదు. ఇప్పుడెందుకో ఇదివరకంత ఆసక్తి లేదు. ప్రస్తుతానికి సినిమాలు చూసి ఆనందించడమే.

 2. ఉగాది శుభాకాంక్షలు.

 3. బాగుంది మీ ప్రయాణానుభవం …గిజిగాడు


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: