వ్రాసినది: శ్రీవాసుకి | ఫిబ్రవరి 16, 2010

నాకు నచ్చిన పుస్తకాలు…

నాకు చాలా పుస్తకాల పిచ్చి. దాని కుల గోత్రాలతో సంబంధం లేదు. ఎలాంటిదైనా ఒకసారి చదివిగాని వదలను. చిన్నప్పుడు చందమామ వీరాభిమానిని. దానితోపాటు బొమ్మరిల్లు, బాలజ్యోతి, బుజ్జాయి కూడా చదివేవాడ్ని. కాని ఎందుకో చందమామ అంటే చాలా ఇష్టం. దాంట్లో రంగుల బొమ్మలు బాగా ఆకర్షించేవి. అందులోని రాజుల జానపద కథలు, విక్రమార్క కథలు చదివి ఏదో ఊహాలోకంలోకి వెళ్ళిపోతుండేవాడ్ని. తర్వాత తర్వాత కొంచెం వయసు ఎదిగాక పానుగంటి, మధుబాబు వ్రాసిన షాడో, బుల్లెట్ వంటి గూఢచారి నవలలంటే చెవి కోసేసుకోవడమే. పైపెచ్చు అవి అద్దెకు తెచ్చుకుని మరీ చదివేవాడ్ని. అప్పట్లో వాటి అద్దె 15, 20 పైసలు ఉండేవి. డబ్బులు పాడుచేస్తున్నానని ఇంట్లో ఎంత తిట్టినా చెవికెక్కేది కాదు. ఆశ్చర్యమేమంటే మా ఇంట్లో వారం వారం స్వాతి పత్రిక కొనేవారు. జానపదంలో నాకు నచ్చినది “అపూర్వ సహస్ర శిరఛ్చేద చింతామణి”. ఈ కథ చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఒక దేశపు యువరాణి మాంత్రికుడి మాయలో పడి అడిగే విచిత్రమైన ఐదు ప్రశ్నలకు జవాబు చెప్పగలిగిన వార్ని ఆమె వివాహమాడుతుంది. లేదంటే వారికి శిరఛ్చేదం తప్పదు. ఆ ఐదు ప్రశ్నలకు సమాధానం కనుక్కొవాలంటే ఐదు నగరాలకు వెళ్ళాలి. కథానాయకుడు గారు తన స్నేహితుడైన మంత్రి కుమారునితో కలిసి ఆ రహస్యాన్ని తెలుసుకుంటాడు. ఇది చాలా బాగుంటుంది. పుస్తకం కూడా కొంచెం పెద్దదే. దొరికితే తప్పక చదవండి.
నాకు ఆధ్యాత్మిక పుస్తకాలన్నా పిచ్చే. ప్రతి నెల ఋషిపీఠం కొనే అలవాటుంది. స్వామి రామా వ్రాసిన హిమాలయాలలో యోగులు అనే పుస్తకం బాగుంటుంది. అక్కడ వారి జీవిత విధానాన్ని గురించి తెల్పుతుంది ఈ పుస్తకం. ఇవిగాక నన్ను బాగా ఆకర్షించినవి, ఇష్టమైనవి పుస్తకాలు రెండు అందులో ఒకటి “ఒక యోగి ఆత్మకథ”, పరమహంస యోగానంద వ్రాసిన ఆయన యొక్క స్వీయచరిత. ఆయన పుట్టడం, చిన్నప్పటి నుండి యోగిగా మారాలనే ప్రయత్నంలో భాగంగా గురువు కోసం వెదకడం. యుక్తేశ్వర గిరి అనే గురువుగార్ని కలవడం ఆయన ద్వారా క్రియాయోగం అనే ప్రాచీన భారతీయ ధ్యానయోగాన్ని నేర్చుకోవడం. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పినటువంటి ధ్యానయోగమిదే. తర్వాత ఆయనకు శ్రీ మహావతార్ బాబాజీ దర్శనం కలగడం, ఆయన ప్రేరణతో అమెరికా మరియు పాశ్చాత్య దేశాలలో పర్యటించి క్రియాయోగ ప్రాశస్త్యాన్ని తెల్పడం. అమెరికాలోని కాలిఫోర్నియాలో క్రియాయోగ ధ్యాన కేంద్రాన్ని నెలకొల్పడం, ఇవిగాక ప్రజల మధ్య జీవిస్తూండే కొంతమంది యోగుల మహిమలు వారి జీవన విధానం మనకు తెలుస్తుంది. ఇందులో ఆయన క్రైస్తవ మరియు హిందూ యోగుల గురించి తెలియజేసారు. మన దగ్గర ఉండాల్సిన పుస్తకం.
రెండవది కంచి కామకోటి పీఠాధిపతి పరమాచార్య శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి జీవిత చరిత్ర. నడిచే దేవుడుగా ఆయన ప్రసిద్ధులు. భారతదేశమంతా కాలి నడకన తిరిగింది ఈయనే. మహిమాన్వితులు, మంత్ర శక్తి సంపన్నులు. అందుకే అందరూ ఆయన్ని “నడిచే దేవుడు” అంటారు. ఆదిశంకరాచార్యుల తర్వాత 2500 సంవత్సరాల చరిత్ర గల కంచి పీఠానికి అంత్యంత పేరు ప్రఖ్యాతులు తెచ్చింది ఈయనే. చాలా నిరాడంబరంగా, నిష్టతో పీఠాన్ని నడిపారు. నడిచే దేవుడు ఆయన జీవిత చరిత్ర. ఈరెండు పుస్తకాలు తప్పక చదవాల్సినవి. ఇవండీ నా ఇష్టాలు, ఇంతకూ మీ ఇష్టమైన పుస్తకాలు ఏమిటో సెలవీయండి.

Responses

 1. శ్రీవాసుకి గారు
  బ్లాగు లోకానికి స్వాగతం
  wish you all the best

 2. అపూర్వ సహస్ర శిరఛ్చేద చింతామణి పుస్తకం ప్రచురణ కర్తలు ఎవరు. నేను తెచ్చుకుంటాను.

  • ప్రచురణకర్తలు ఎవరో నాకు సరిగ్గా తెలియదండీ. అది చదివి చాలా రోజులయింది. కాకపోతే మీరు పుస్తక ప్రదర్శనలు జరిగేచోట ప్రయత్నించవచ్చు లేదా విశాలాంధ్ర పబ్లికేషన్స్ లో ప్రయత్నించండి. మొన్న నేను అక్కడే (రాజమండ్రి) చూశాను.

 3. బాగుంది.. నేను ఈ మధ్య కొన్న పుస్తకాల వివరాల ఇక్కడ:
  http://pustakam.net/?p=3812

  • నా బ్లాగ్ దర్శించినందుకు ధన్యవాదాలు. మీరిచ్చిన పుస్తక లింక్ చూసాను బాగుంది. కాని తెలుగు కి ఎక్కడ చోటు లేదన్నమాట.

 4. హహ.. మధుబాబు, పానుగంటే కాదు, కొప్పిశెట్టి, నాగిరెడ్డి. ఇంకా గిరిజ శ్రీ భగవాన్, కొమ్మూరి సామ శివరావ్ నవలలు తెగ చదివేవాన్ని. ఇంట్లో వాటిమీద వ్యతిరేకత ఎలా వచ్చిందంటే మా అన్నయ్య వెల్లి, మావాడు వస్తే పుస్తకాలు అద్దెకివ్వకండని షాపులో చెప్పాడు. మీ అన్న ఇవ్వద్దన్నాడు కాబట్టి నీకివ్వలేం బాబూ అని చెప్పేసారు వాల్లు. అయిన మనం తగ్గుతామా? వాల్ల తెలివితేటలు వాల్లవి మన తెలివి తేటలు మనవి. నా స్నేహితులని పంపించి ఫలానా రచయిత పుస్తకాలు తెమ్మని చెప్పి చదువుకునే వాడ్ని.

  • అయితే మీరు నా తరహా మనిషే అన్నమాట. నా మీద కూడా చాలా ఆంక్షలు ఉండేవి పుస్తకాలు చదవకుండా. ఎప్పటికప్పుడు సరికొత్త ఉపాయాలతో తప్పించుకొనేవాడ్ని. నా బ్లాగ్ దర్శించినందుకు మీకు ధన్యవాదాలు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: