వ్రాసినది: శ్రీవాసుకి | ఫిబ్రవరి 11, 2010

సుజలం, సుఫలం నదుల అనుసంధానం.

ముందుగా నా బ్లాగ్ వీక్షక మిత్రులందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు.

సుజలం, సుఫలం వందేమాతరంలోని ఈ వ్యాఖ్యలు నిజమవ్వాలంటే నదుల అనుసంధానం జరగాలి. నదుల అనుసంధానం ఈ మాట మొదటిసారి విన్నప్పుడు ఏదో వెరైటీగా అనిపించింది. తర్వాత తెలుసుకొంటే సాధ్యమే అనిపించింది. భారతదేశ వ్యాప్తంగా గంగ, నర్మద, బ్రహ్మపుత్ర, యమున వంటి పెద్ద పెద్ద నదులు ప్రవహిస్తున్నాయి. ప్రవహిస్తున్న నీరు ఎక్కువ భాగం సముద్రంపాలై మనకు వినియోగం కావడం లేదు. అలా వృధాపోతున్న నీటిని ఆపగలిగితే త్రాగుటకు, పంటలకు అవసరమైన మరింత నీరు లభిస్తుంది. దీనికి మార్గం ఉత్తర, దక్షిణ భారతాలలో ప్రవహిస్తున్న నదుల్ని ఒకదానితో ఒకటి అనుసంధానం చేయడమే.

మన రాష్ట్రంలో ప్రవహిస్తున్న గోదావరి, కౄష్ణా జలాలను మనం ఈ రోజు వరకు సమర్ధవంతంగా వినియోగించుకోవడం లేదు. వర్షాకాలంలో అతిగా వరద నీరు, వేసవి నాటికి అసలు నీరే లేకపోవడం. దీనివల్ల రెండు, మూడు పంటలకు నీరందకపోవడం. ఈ సంవత్సరం అయితే నీటి కరువు మూలంగా పంటలు దెబ్బతిన్నాయి. ఏటా వచ్చే వరదల వల్ల సుమారుగా 70 లక్షల క్యూసెక్ ల గోదావరి నీరు సముద్రం పాలవుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట (బ్యారేజ్) కొంత వరకు మాత్రమే దీనిని ఆపగలుగుతోంది. ఇక్కడ నుండి కోనసీమ ప్రాంతానికి కాలువల ద్వారా నీరు విడుదలవుతుంది. ధవళేశ్వరం లోపులో గోదావరి మీద మరే రకమైన కట్టడం లేకపోవడం వలన నీరు వృధా పోతోంది. గోదావరికి ఖమ్మం మరియు ఇతర ప్రాంతాల నుండి ఉపనదులు కలుస్తాయి. అవన్నీ కలిసి పాపి కొండలు దాటి రాజమండ్రి వచ్చేసరికి అఖండ గోదావరిగా మారుతుంది. ఇక్కడ నుండి 70 కి.మీ. ప్రవహించి అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తుంది.

గోదావరిలాగే కృష్ణా జలాలు కూడా వృధాపోతున్నాయి. ఈ వృధా నీటిని అరికట్టాలంటే అనుసంధానమే మార్గం. ఈ రెండింటి మధ్య అనువైన ప్రదేశాలగుండా కాలువలు త్రవ్వి అనుసంధానించవచ్చు. ఈ కౄష్ణా జలాలను కాలువల ద్వారా అటు రాయలసీమ వైపు మళ్ళించటం వల్ల ఆ ప్రాంతాల పంటలకు, త్రాగడానికి నీరు లభ్యమవుతుంది. ఈ కాలువలను నెల్లూరు, చిత్తూరు ప్రాంతాలలో ఉన్న కాళింది, స్వర్ణముఖిలాంటి నదులతో అనుసంధానించాలి. క్రితం సంవత్సరం కౄష్ణానదికి వరదలు రావడం వలన కలిగిన అపారనష్టం అందరికి తెలిసిందే. శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాంలు సైతం ఆ వరద ఉధృతికి తల్లడిల్లాయి. స్థాయిని మించిన వరదని అవి ఆపలేకపోయాయి. అటువంటప్పుడే కాలువలకి అనుసంధానించడం ద్వారా ఆ వరద నీటిని ఇతర ప్రాంతాలకు తరలించవచ్చు. లేదంటే ఇదంతా ఎప్పుడూ సముద్రం పాలవుతూనే ఉంటుంది.

అలాగే గోదావరి తెలంగాణా ప్రాంతం గుండా మన రాష్ట్రంలో అడుగుపెడుతుంది. అక్కడ దానికి ఉపనదిగా మంజీర ఉన్నది. దాని నుండి కూడా కాలువలు త్రవ్వితే దాని వల్ల ఆయా ప్రాంతాలలో అవసరమైన సమయాలలో నీటి ఎద్దడి లేకుండా ఉంటుంది. గ్రామాలలో చెరువులు నిర్మించి కాలువ నీటిని అందులోకి మళ్ళించాలి. అందువల్ల భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. నదుల మీద కూడా అవసరమైన చోట చిన్న చిన్న ఆనకట్టలు వంటివి నిర్మించి నీటిని నిల్వ చేయవచ్చు. డ్యాంలు, ఆనకట్టలున్న చోట నుండి కాలువల ద్వారా ఈ రెండు నదీజలాల్ని మళ్ళించాలి. మళ్ళించటం అంటే “అసలుకు ఎసరు తేవడం” కాదు. ఏటా వృధా అవుతున్న నీటిని ఇటుగా మళ్ళించాలి.

చంద్రబాబు హయాంలో మా ప్రాంతంలో పుష్కర ఎత్తిపోతల పథకం క్రింద గోదావరి నీటిని ప్రధాన కాలువ ద్వారా రాజమండ్రి నుండి మళ్ళించారు. మా ఏరియాను “చాగల్నాడు” అంటారు. అన్ని మెట్ట ప్రాంతాలు కావడం వల్ల నీటి లభ్యత తక్కువ. వర్షాకాలపు నీటితో నిండే చెరువులే శరణ్యం. ఎకరం 10, 15 బస్తాలు మించి పండేది కాదు. కాని నేడు పుష్కర పథకం పుణ్యమా అని ఎకరం 30 బస్తాల ధాన్యం వస్తోంది. అంతేగాక ఈ ప్రధాన కాలువ నుండి కొన్ని ఉప కాలువలు పొలాల గుండా ప్రవహిస్తుంటాయి. వేసవి సమయానికి రైతులు ఈ నీటిని చెరువులలోకి మళ్ళిస్తారు. వేసవి నాటికి గోదావరిలో నీరు తగ్గుతుంది. అందువల్ల వేసవిలో అపరాల సాగుకు ఇబ్బంది ఉండదు. మాకు ఇప్పటికీ త్రాగునీటికి చెరువులే ఆధారం. బావులు ఉన్నా అవి ఉప్పు నీరే. ఈ మాత్రం భాగ్యానికి నోచుకోని ప్రాంతాలు మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి.

ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టింది. దీని ద్వారా అటు ఉత్తరాంధ్రకు, ఇటు కృష్ణా మీదుగా రాయలసీమకు గోదావరి జలాలను తరలించాలని ఉద్దేశ్యం. కాని ఇక్కడ కొంత చిక్కు ఉంది. కీలకమైన పాపి కొండల అభయారణ్యం, కొన్ని వందల గ్రామాలు భద్రాచలం వరకు నీట మునుగుతాయి. ప్రజలకు పునరావాసం పెద్ద సమస్య. ప్రాజెక్ట్ ఎత్తు ఎక్కువ, ఖర్చు కూడా ఎక్కువే. దీనికి నివారణ ప్రాజెక్ట్ బదులుగా ఆనకట్ట కట్టాలని ఒక ప్రతిపాదన ఉంది. దాని వలనయితే ఎక్కువ నష్టం ఉండదని ఒక అంచనా. రాజకీయ నాయకులు అనవసర విషయాల మీద చర్చించడం కన్నా ప్రజలకు ఉపయోగపడే ఇటువంటి కార్యక్రమాల మీద దృష్టి నిలపడం మంచిది. ఆయా ప్రాంత ప్రజలు వీరి మీద ఒత్తిడి తేవడం ద్వారా తమను తాము బాగు చేసుకోవడం మంచిది. మన దేశం మొదటి నుండి వ్యవసాయక దేశం. ఎన్నో కుటుంబాలకి వ్యవసాయమే ప్రధాన వృత్తి. చక్కని సాగునీటి లభ్యత ఉంటే ప్రాంతీయ పరిస్థితుల ఆధారంగా రైతులు మంచి పంట పండించగలుగుతారు. ప్రభుత్వాలు కూడా అందుకు సహకరించాలి. చాలామంది నాయకులు వ్యవసాయ కుటుంబాలు నుండి వచ్చిన వారే. వారికి తెలియనది కాదు. జలయజ్ఞం పేరిట పెట్టె కోట్ల రూపాయల ఖర్చు నదుల అనుసంధానానికి వినియోగిస్తే మేలు. దానివల్ల అన్నిచోట్ల నిండు జలాలు కనువిందు చేస్తాయి. అప్పుడది నిజమైన జలయజ్ఞమవుతుందని నా ఉద్దేశ్యం.

నివాసయోగ్యమైన స్థలం కోసం మానవుడు అంతరిక్షంవైపు ఆశగా చూస్తున్నాడు, వెతుకుతున్నాడు. మనిషి మనుగడకి అవసరమైనది ప్రాణవాయువు, దాని తర్వాత స్థానం నీరే. చంద్రుడి మీద, అంగారుకుడి మీద నీటి జాడలకై అన్వేషణ చేస్తూనే ఉన్నాడు. చిన్నప్పుడు చదువుకున్నాం కదా ప్రపంచవ్యాప్తంగా నాగరికతలన్నీ నదీతీర ప్రాంతాలలోనే విలసిల్లాయని. ఇంత తెలుసు కాబట్టే ఇకముందు కూడా జాగ్రత్త వహించి నదీ జలాలను, భూగర్భ జలాలను రక్షింద్దాం. రాబోయే తరాలకు అనంత జలరాశులను కానుకగా ఇద్దాం.


Responses

  1. డియర్ శ్రీ వాసుకి గారూ !,
    ఎన్నడో డా.కెల్ రావు గారందించిన ప్రతిపాదనలను ప్రభుత్వాలు పరిశీలించి పాటించి,అమలు పరిచి వుంటె ,ప్రపంచ బ్యాంకు నుండి తెచ్చిన ఋణం, తాత్కాలిక ప్రయోజనాల పేరుతో దోపిడీకి గురవుతున్న ధనం.శాశ్వత రూపాన్ని పొందలేక విగ్నానవంతుల పతిపాదనలు.శాశ్వత ప్రయోజనాలు చేకూర్చే ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టే ప్రభుత్వాలను ప్రజలు దూరం చేసుకోవడం,….మనమెక్కడకు పోతున్నాం? మనమేమైపోతున్నాం?…మీ ప్రయత్నం అభినందనీయం ..శ్రెయొభి లాషి …నూతక్కి

    • @ రాఘవేంద్రరావు గారు
      ధన్యవాదాలండీ.ప్రభుత్వాలు సరిగ్గ స్పందిస్తే వృధా నీరు, వృధా డబ్బు మిగులుతాయి. వేసవి కాలం వస్తేగాని నేతలు నీళ్ళ అవసరం గుర్తుకు రాదు. ప్రజలు అంతే దేనికి నిలదీయరు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: