వ్రాసినది: శ్రీవాసుకి | ఫిబ్రవరి 3, 2010

ఇద్దరు మిత్రుల కథ

నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఇంఫోటెక్ కంపెనీలో పనిచేసే రోజుల్లో ఒకరోజు అమీర్ పేటలో ఉన్న గ్లోబల్ ట్రస్ట్ బాంక్ కి వెళ్ళాను. అది హుడా మైత్రీవనం వెనుక వైపు ఉండేది. ఇప్పుడు ఓరియంటల్ గా పేరు మార్చేశారు. నా దగ్గర కొంత మొత్తం ఉంది దానిని బాంక్ లో జమ చేద్దామని అక్కడున్న వరుసలో కూర్చున్నాను. ఇంతలో నా ప్రక్కన ఒక వ్యక్తి కూర్చున్నాడు. నాలాగే పని మీద వచ్చినవాడై వుంటాడని అనుకొన్నాను.పెద్దగా పట్టించుకోలేదు. కాని కాసేపటి తర్వాత అతను అదే పనిగా నాకేసి చూడటం మొదలుపెట్టాడు.నా చేతిలో డబ్బు వుంది. అందుగురించేమోనని నా అనుమానం దాంతో డబ్బుని జాగ్రత్తగా జేబులో పెట్టి చెయ్యి అడ్డుగా పెట్టుకున్నాను. అతనేమో నన్ను చూసి కొద్ది కొద్దిగా నవ్వుతున్నాడు. నాకేమో అనుమానం పెరిగిపోతోంది. ఇంతలో నా వంతు వచ్చింది. తొందర తొందరగా జమ చేసి వెనక్కి తిరిగి చూస్తే అతడు లేడు. హమ్మయ్య అనుకొన్నాను.

 

ఇంతలో మళ్ళీ ఇంకో విషయం గుర్తొచ్చి బాంక్ కి బయట వైపున్న ఏ.టి.యం లోకి వెడుతున్నా, వెడుతూ ప్రక్కకు చూస్తే అతను మళ్ళీ గేటు దగ్గర బైక్ మీద కూర్చుని ఉన్నాడు. ఇదెక్కడి గొడవరా బాబు నన్ను వీడు వదిలేటట్టు లేడనుకున్నాను.ఏ.టి.యం లోకి వెళ్ళి డబ్బు తీసుకుని గేటు బయటకు వస్తుంటే అతను పలకరించాడు. మీరు శ్రీనివాస్ కదా అని అడిగాడు. అలా అడిగి నవ్వుతున్న అతనిని నాకు ఎప్పుడో చూసిన జ్ఞాపకం వస్తోంది. నాలో అనుమానం పోయి ఆలోచన పెరిగింది. తదేకంగా అతని నవ్వు చూశా అప్పుడు అర్థమయింది, వెంటనే నువ్వు విజయ్ కదా అన్నాను ఏదో తెలియని సంతోషంతో. అవునని తలూపుతూ అతను బండి దిగి దగ్గరకి వచ్చాడు.అంతే ఇద్దరం ఒకర్ని ఒకరం గట్టిగా హత్తుకున్నాము. తను ఎవరో కాదు 10 సంవత్సరాల క్రితం దూరమైపోయిన నా బాల్య స్నేహితుడు. బాంక్ లో ప్రక్కన కూర్చున్నప్పుడు నా ముక్కు మీదున్న చిన్న గాటు ఆధారంగా వాడు నన్ను గుర్తుపట్టాడు. నాకు రెండేళ్ళ వయసు ఉన్నప్పుడు ఊయలలోంచి పడిపోయినప్పుడు పాల సీసా పగిలి తగిలిన దెబ్బది. ఈ రోజుకి అలానే ఉందది. అది చూసి నా మిత్రుడు గుర్తు పట్టడం నిజంగా గొప్పే. నేను ఎలా గుర్తు పట్టానో తెలుసా వాడి సొట్టా బుగ్గల నవ్వు చూసి నిజంగానే. చిన్నప్పుడు వాడి బుగ్గలు బూరుల్లా ఉండేవి, నవ్వితే సొట్టలు పడేవి. స్కూల్లో చదివే రోజుల్లో మేమంతా వాడి తెల్లని పాల బుగ్గలు గిల్లేసే వాళ్ళం. సరే విషయానికి వస్తే అలా ఇద్దరం కొద్దిసేపు ఏదో తెలియని ఆనందంలో ఉండిపోయాము. ఒకరి కుశలం ఒకరు అడిగి తెలుసుకున్నాము.అసలు ఈ రకంగా ఇద్దరం తిరిగి కలుస్తామని కలలో కూడా అనుకోలేదు. అనంతరం దగ్గరలోనే ఉన్న హోటల్ కి వెళ్ళి కాఫీ త్రాగుతూ ఆ పాత రోజులు, మేము విడిపోయిన కారణాలు ఒకరితో ఒకరు మనసు పూర్తిగా మాట్లాడుకున్నాము.

పదో తరగతి చదివే రోజుల్లో వాళ్ళ కుటుంబం కొన్ని అనివార్య (ఆర్ధిక) కారణాల వలన మా ఊరి వదిలివెళ్ళి పోయారు. వాళ్ళు వెళ్ళిపోయే రోజు నేను లేను. మా బామ్మగారు కాలం చేయటంతో అక్కడికి వెళ్ళాము. 10 రోజులుండిపోయాము. తను ఊరు వదిలి వెళ్ళిపోయే రోజు నన్ను కలిసి విషయం చెబుదామని వచ్చాడు. కాని అప్పటికి మేము ఇంకా రాలేదు. దానితో తను తిరిగి వెళ్ళి పోయాడు.వేరెవరికి ఏమి చెప్పలేదు. తర్వాత రెండు రోజులకు మేము వచ్చాము. అలవాటుగా వాళ్ళింటికి వెళ్ళాను. ఇల్లు తాళం పెట్టి ఉంది. చుట్టు ప్రక్కల వార్ని అడిగితే విషయం చెప్పారు. నాకు ఒక్కసారిగా బాధ తన్నుకొచ్చింది. ఇంతకాలం కలిసి స్కూల్ కి, ట్యూషన్ కి, సినిమాలకి తిరిగాము. నాతో ఒక్కమాటైన చెప్పలేదని తీవ్రంగా కలత చెందాను. ఇంటికి వచ్చి అమ్మ, నాన్నలతో చెప్పి ఏడ్చాను.కొన్ని రోజులు నా మనసులో ఏదో తెలియని బెంగ. మేమిద్దరం రెండవ తరగతి నుండి స్నేహితులం. క్రికెట్ అంటే ఇద్దరికి పిచ్చి. ఖాళీ దొరికితే చాలు బాట్ (కొబ్బరి మట్ట,చెక్క ముక్కలు), బంతితో ప్రళయం సౄష్టించేవారం. తెల్లవారు జామునే లేచి వాడు మా ఇంటికి వస్తే ఇద్దరం కలిసి ప్రైవేట్ కి వెళ్ళేవాళ్ళం. ఒకటనేమిటి ఏదైనా ఇద్దరం కలిసే. మా రెండు ఇళ్ళలోను మా క్రికెట్ పిచ్చి చూసి తెగ తిడుతూండేవారు. ఇద్దరం ముసిముసి నవ్వులతో మా పని మేము చేసేవాళ్ళం. అలాంటి స్నేహితుడు ఒక్కసారిగా దూరమైతే అది అత్యంత బాధాకరం. ఆ వయసులో అతడి గురించి ఎలా తెలుసుకోవాలో నాకు అర్థం కాలేదు. విడిపోవడానికి కొన్ని రోజుల ముందు తను వ్రాసిచ్చిన సూపర్ స్టార్ కౄష్ణ చిరునామా కాగితం నా దగ్గర గుర్తుగా ఉండిపోయింది.ఈ రోజుకి నా దగ్గర ఉంది. మేమిద్దరం తిరిగి కలిసినప్పుడు తనకి చూపించాను. దేవుడి దయో, మా అదౄష్టమో తిరిగి పదేళ్ళ తర్వాత ఇద్దరం కలిసాము. చెప్పలేనంత ఆనందం. తరుచూ ఇద్దరం కలిసే వాళ్ళం.

తర్వాత నేను 2003 లో హైదరాబాద్ నుండి నాన్నగారి కోరిక మేరకు ఉద్యోగం వదిలి వచ్చేశాను. ఇప్పుడు మా ఊర్లోనే ఉంటున్నాను. తను మాత్రం ఇప్పటికి హైదరాబాద్ లోనే ఉన్నాడు. ఇరువురం ఒకరి పెళ్ళికి ఒకరం వచ్చాము. మా రెండు కుటుంబాలు తిరిగి కలిసాయి. ఇప్పుడు వాడికొక 3 ఏళ్ళ పాప, నాకొక 2 ఏళ్ళ పాప. వాడు మేనమామ కూతుర్నే పేళ్ళి చేసుకున్నాడు. చిత్రం ఏమిటంటే మా చిన్నప్పుడు ఆ అమ్మాయి బాగా చిన్న పిల్ల. మేము ఎత్తుకుని ఆడించేవాళ్ళం. అవన్నీ తలుచుకొంటే ఇప్పటికీ నవ్వొస్తుంది. ఆ అమ్మాయి, నా భార్య ఇప్పుడు మంచి స్నేహితులు మాలాగే. మా ఇరువురి పాపల బారసాల కి ఒకరింటికి ఒకరు వెళ్ళాము. భవిష్యత్ లో వారిద్దరూ మంచి స్నేహితులు కావాలని ఆశిస్తున్నాను. అలాగే భగవంతుడి దయ వల్ల మా ఇరువురి స్నేహం చిరకాలం కొనసాగాలని ఆశిస్తూ….సెలవు తీసుకొంటున్నాను.


Responses

  1. నేను కూడా మీరు ఇలాగే కలిసుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటునా


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: