వ్రాసినది: శ్రీవాసుకి | ఫిబ్రవరి 2, 2010

ఓ అభిమాని గోడు – 3

                     మరో విషయం చెప్పడం మరిచాను అది నేను జాకీచాన్ కి ఉత్తరాలు వ్రాయడం మొదలుపెట్టిన సంవత్సరం తర్వాత అక్కడి నుండి వచ్చిన ఒక ఉత్తరంలో వేరే దేశంలో ఉన్న అతనియొక్క అభిమాన సంఘాల చిరునామాలు ఉన్నాయి. హాంకాంగ్ లో ఉన్నది అధికారికమైనది ఐతే గుర్తింపు పొందినవి అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాడ్, జపాన్ లలో ఉన్నాయి. అప్పుడు నేను ఆస్ట్రేలియా లోని సిడ్నీ లో ఉన్న జాకీచాన్ అభిమాన సంఘానికి ఉత్తరం వ్రాస్తే, తిరిగి వారు కూడా సమాధానం పంపారు. దానితోపాటు సభ్యునిగా నమోదు కావడానికి అవసరమైన పత్రాలు కూడా పంపారు. నేను వాటిని పూర్తి చేసి తిరిగి వార్కి పంపుతూ సభ్యత్వ నమోదు నిమిత్తం డబ్బు కట్టలేనని చెప్పాను. సుమారుగా 1600/- కట్టాలి. అది నావల్ల అయ్యే పనికాదు. అలా అని వ్రాసి పంపాను. 1 నెల తర్వాత వారి నుండి సమాధానం వచ్చింది. నాకు ఉచితంగా సభ్యత్వం ఇచ్చినట్లు చెప్పారు. అప్పుడు సరిగ్గా 15 రోజుల తర్వాత నాకు హాంకాంగ్ లోని జాకీచాన్ కార్యాలయం నుండి ఒక ఉత్తరం వచ్చింది. అందులో ప్లాటినం సభ్వత్వ కార్డ్,జాకీచాన్ స్వహస్తంతో సంతకం చేసిన అతని చిత్రం, మరియు హాంకాంగ్ లోని ప్రముఖ షాపులు, హోటల్స్ ల చిరునామాలు కొన్ని ఉన్నాయి. అంటే ఆ కార్డ్ ఉపయోగించి మనం ఆ పట్టికలోని షాపులకు వెళ్ళి రాయితీల మీద కావాల్సినవి కొనుక్కోవచ్చు.

 

నాకు ఇంత మంచి ఉచిత అవకాశం ఇచ్చిన వ్యక్తి ఆస్ట్రేలియా అభిమాన సంఘం అధ్యక్షురాలు పేరు క్రిస్టిన్ ముల్లెన్. నా ఉచిత సభ్యత్వం రెండు సంవత్సరాలు కొనసాగింది. ఆమెకి నేను జాకీచాన్ గురించి వ్రాసిన అన్ని ఉత్తరాలు నచ్చాయి. అంతేకాదు నేను జాకీచాన్ చిత్రంలోని ఒక ఫైటింగ్ సన్నివేశాం మీద నేను గీసిన ఒక వ్యంగ్య చిత్రాన్ని కూడా ఆమె త్రైమాసిక పుస్తకంలో ప్రచురించడమే గాక నేను గీసిన ఆ యొక్క చిత్రాన్ని జాకీచాన్ వ్యక్తిగత కార్యదర్శికి కూడా పంపింది. అతని నుండి నాకు మెచ్చుకోలు ఉత్తరం కూడా వచ్చింది. నా పుట్టినరోజు కానుకగా ఆమె జాకీచాన్ స్వీయకథ పుస్తకం మరియు ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన కాలెండర్లు, పోస్టర్లు, కీ చెయిన్లు పంపించారు. నేను కూడా ఆమెకి మన దేశ సంస్కౄతి సాంప్రదాయాలకు సంబంధించిన కార్డ్స్, తెలుగు, హిందీ సినిమాల పాటలు పంపించాను. మా ఇరువరి స్నేహం 1996 సంవత్సరం నుండి అప్రతిహతంగా కొనసాగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మేము కూడా మాములు ఉత్తరాలతోపాటు, విద్యుత్ ఉత్తరాలు కూడా పంపుకొంటున్నాము. ఈరోజుకి జాకీ సినిమాలు చూస్తూనే ఉంటాను.జాకీకి అధికారిక వెబ్ సైటు కూడా వుంది. ఈ నా పిచ్చి ఇలా ఎంతకాలం నడుస్తుందో తెలీదు. కాని అదో తెలీని ఆనందం.

 

ఇంతకు ముందు టపాలో నేను కేరళ రాజధాని త్రివేండ్రం వెళ్ళాను అని చెప్పానుగా. అక్కడ ఆరు నెలలు ఉన్నాను. మార్కెటింగ్ ఉద్యోగం చేసేవాడ్ని. అక్కడున్నా నా ఉత్తరాల అలవాటు మానలేదు. ఆరు నెలల తర్వాత ఆరోగ్య కారణాల వల్ల ఉద్యోగానికి ఠాం ఠాం కొట్టేసి మా ఊరు వచ్చేసాను. మళ్ళీ ఒక నెల విరామం తర్వాత హైదరాబాద్ బయలుదేరాను ఉద్యోగ వేటకి. పిల్లి తన పిల్లల్ని ఏడు ఇళ్ళు మారుస్తుందన్నట్టు నేను కూడా అక్కడున్న ఐదు సంవత్సరాల కాలంలోను ఓ ఆరు ఉద్యోగాలు మారాను. కంప్యూటర్ ప్రోగ్రామర్ కావాలనుకున్న నా ఆశల మీద అమెరికాలో కూలిపోయిన కవల టవర్స్ నీళ్ళు చల్లాయి. అదంతా వేరే కథనుకోండి. కాని అక్కడ కూడా నా వీరాభిమానం కొనసాగింది. మళ్ళీ 2003 లో ఇంటికి వచ్చేశాను నాన్నగారి కోరికపై. ఖాళీగా ఉండకూడదన్న ఉద్దేశ్యంతో మా దగ్గరి బంధువుతో కలిసి డేటా ఎంట్రీ పని మొదలుపెట్టాను. దానితోపాటు అంతర్జాలం కూడా.

 

అలా రోజులు సాగిపోతున్నాయి. 2004 అక్టోబర్ వచ్చింది సరిగ్గా సమయానికి నేను పనితో ఖాళీ లేకుండా ఉన్నా..ఆ సమయంలోనే జాకీచాన్ భారత్ వస్తున్నట్టు నా ఆస్ట్రేలియా స్నేహితురాలు ఇ-ఉత్తరం పంపింది. వెంటనే నేను నెట్లో అందుకు సంబంధించిన వివరాలు వెతికాను. జాకీచాన్ క్రొత్త చిత్రం “ది మిత్” షూటింగ్ కోసం హంపి వచ్చిన్నట్లు తెలిసింది. అది చూసి నా మనసు నాలో లేదు.భలే అవకాశం వచ్చింది. వెళ్ళీ కలవాలనిపించింది. పైపెచ్చు జాకీచాన్ షూటింగ్ కి ఏ దేశం వెళ్ళిన వీలునిబట్టి అభిమాన సంఘ సభ్యులను కలుస్తుంటాడు. నేను ఎలాగు అభిమానిని మరియు అభిమాన సంఘం సభ్యుడ్ని కదా. నా దగ్గర ఉన్న అభిమాన సంఘం సభ్యత్వ కార్డ్, నాకు అతని దగ్గర నుండి వచ్చిన ఫోటోలు, త్రైమాసిక పుస్తకాలు ఉన్నాయి. వాటిని చూపిస్తే అతనిని కలవడానికి అవకాశం ఉంటుందని భావించాను. రెండు రోజులు కష్టపడి మా నాన్నగార్ని ఒప్పించి ఓ రెండువేలు పట్టాను. నేను చేసే పని ద్వారా వచ్చిన వెయ్యి రూపాయలు సిద్దం చేసాను. హంపి కర్ణాటకలో ఉందని తెలుసు కాని ఎలా వెళ్ళాలో తెలియదు. అందుకని హంపి ఎలా వెళ్ళాలో అని నెట్లో దానికి వెళ్ళే రాచమార్గం చూసుకున్నాను. అప్పటికే జాకీచాన్ వచ్చి 14 రోజులయ్యింది. నేను చేస్తున్న పని ఏమో పోలీస్ లకు సంబంధించినది. అందులో పని చేస్తున్న తెలుసున్నాయన ద్వారా వచ్చిన పని అది. సుమారు 10 రోజుల నుండి చేస్తున్నాను. మా నాన్నగారు ఒప్పుకోవడంతో త్వరత్వరగా పూర్తి చేసి వెడదామనుకున్నా కాని కుదరలేదు. ఆయనకి ముఖ్యమైన పని మీద వేరే ఊరు వెళ్ళాలని చెప్పి మళ్ళీ వచ్చాకా పూర్తి చేస్తానని చెప్పా. ఓ శుక్రవారం ఉదయం నా ప్రయాణం విజయవాడ వైపుగా ప్రారంభించా అంతులేని ఆనందంతో …..

                                                           (ఇంకా వుంది)


Responses

  1. intresting,chaalaa baagundi.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: