వ్రాసినది: శ్రీవాసుకి | జనవరి 28, 2010

ఓ అభిమాని గోడు

నేను విజయనగర సామ్రాజ్య రాజధాని అయిన హంపి పట్టణాన్ని చూసాను. అప్పటి ఆ వైభోగాన్ని తలుచుకొంటే మనసు ఏదోలా అయిపోయింది. హంపిని తలుచుకున్నప్పుడల్లా నా సాహస యాత్ర గుర్తుస్తుంది. అవును నేను ఇంతకీ హంపి ఎందుకు చూడాల్సి వచ్చిందో తెలుసా…అయితే చదవండి మరి.

అభిమానులందు వీరాభిమానులు వేరయ్య అన్నట్టు. నాకు కూడా సినిమా వాళ్ళ మీద అభిమానం ఎక్కువే. ఎంతైనా తూగోజి వాడ్ని కదా.ఐతే ఈ అభిమానం మొదట్లో రాష్ట్రీయ స్థాయిలో ఉండేది.తర్వాత తర్వాత అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఆ కథాక్రమము ఎట్టిదనిన రెండో తరగతి చదివే రోజుల్లో ఎన్.టి.ఆర్ అంటే అభిమానం. మరి మన రాముడు, కృష్ణుడు ఆయనే కదా. కొంతకాలం వరకు ఆ సినిమాలంటే మహానందం.ఆ టైం లోనే ఎందుకో సూపర్ స్టార్ కృష్ణ అంటే అభిమానం కలిగింది.బహుశ కిట్టిగాడు చేసే కర్ర ఫైట్ అంటే మనకి యమా క్రేజీ. అవి చూసి చెవి కోసేసుకోవడమే మన పని. ఉన్నపళంగా నేల మీదనుంచి మేడమీదకు ఎగరడం. ఎవరు చేయగలరు అలా. అగ్నిపర్వతంలో కిట్టి చెప్పిన ఫామస్ డైలాగ్ ఇప్పటికీ గుర్తే, మీకు గుర్తు రావాలే అదే “అగ్గి పెట్టుందా?. అబ్బో అప్పట్లో క్లాస్ రూం లో ఇవే డైలాగ్స్. సింహాసనం సినిమా అయితే ఓ అయిదుసార్లు చూసాను. పండగలప్పుడు మా ఊర్లో వీధి సినిమాలు వేసేవారు. కృష్ణ సినిమా అంటే చాలు రెండు ఇటుకలు పుచ్చుకుని పరుగెత్తే వాళ్ళం. ఇటుకలు దేనికంటే ఎత్తుమీద కూర్చుని చూడటానికి అప్పుడు పిల్లలం కదా. ఆ తర్వాత ఖైదీ హిట్ అవ్వడంతో చిరంజీవి అభిమాని అయిపోయాను. అంతా బ్రేక్ డాన్సే కదా. క్లాస్ మధ్యలో ఖాళీ సమయాలలో మా బ్రేక్ డాన్స్ సాధన జరుగుతూ ఉండేది ఇక తర్వాత వరస పెట్టి అన్నీ చిరు సినిమాలే.

అలా చదువు, సినిమాలు సాగిపోతున్నాయి. ఒకరోజు మా మామయ్య నన్ను ఇంగ్లీష్ సినిమా చూపిస్తాను రా అన్నాడు. ఇంగ్లీష్ సినిమా అంటే కొంచెం భయం వేసింది. అప్పట్లో మా ఊర్లో అన్నీ ఆబాపతు సినిమాలే. ఇంట్లో వాళ్ళ అనుమతితో మొత్తంమీద సినిమాకి వెళ్ళడం జరిగింది. అదే మొదటిసారి ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళడం. కొంచెం కంగారు ఇంకోప్రక్క ఫైటింగ్ సినిమా చూడబోతున్న ఆనందం.అప్పుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాను.సినిమా మొదలయింది.పేర్లు దగ్గర నుండి చదవటం మొదలుపెట్టాను. సినిమా అంతా రసభరింతంగా సాగింది, అయిపోయింది కూడా.కాని నాకు మాత్రం ఒకటి అర్థంకాలేదు ఇంతకీ హీరో ఎవరని. అన్నీ ఒకేలాంటి చైనా ముఖాలే.సినిమా చూస్తుంన్నంతసేపు మా మామయ్య బుర్ర తింటూనే ఉన్నాను. అది నా మొదటి జాకీచాన్ సినిమా పోలీస్ స్టోరీ పార్ట్ -2 అనుభవం. తొలిసారి చూసినప్పుడు అయోమయానికి గురైనా ఆ సినిమా బాగా నచ్చడంతో నా స్నేహితులకు కూడా చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి అందరం కలిసి చూసాము. అందులో జాకీచాన్ చేసిన పోరాటాలు,స్టంట్ సీన్లు బాగా నచ్చయి. నా స్నేహితులకు కూడా. అదిగో అలా అప్పటి నుండి జాకీచాన్ అభిమానిగా మారిపోయాను. అతడి సినిమాలు పాతవి, క్రొత్తవి చూడటం మొదలుపెట్టాను. క్రమేణా వీరాభిమానిగా మారిపోయాను. ఎంతగా అంటే జాకీ సినిమా చూసి ఇంటికి వచ్చి గోడలని, గుమ్మాలని తన్నడం మొదలుపెట్టాను. ఇంట్లోవాళ్ళు నన్ను చూసి పిచ్చి ముదిరిపోయిందనుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకి కుంగ్ ఫూ నేర్చుకోవాలన్న బుద్ది పుట్టింది. ఊర్లోనే ఉన్న ఒక వ్యక్తి ద్వారా కుంగ్-ఫూ లో అడుగుపెట్టాను. కాని అది ఎంతోకాలం సాగలేదు. నేర్చుకోవాలనే కసి మాలో వున్నా నేర్పే గురువులో తపన లేదు. దానితో సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత మా శిక్షణ ఆగిపోయింది. కాని పట్టువదలని విక్రమార్కుల్లాగా మేము (ఇరవైమంది వుండేవాళ్ళం) వెతికి వెతికి విశాఖపట్టణం నుండి ఒక గురువుని రప్పించాము. కాని అది మూణ్ణాల ముచ్చటే అయింది. కారణం కాసుల గలగలలు మా దగ్గర లేకపోవడమే. మేమంతా ఇంటిమీద ఆధారపడ్డవాళ్ళమే. ఐదో, పదో అయితే ఇచ్చుకోగలం కాని వందలు ఎక్కడ తేగలం. దానితో గురువుగార్ని, ఆయన ఖర్చులని భరించటం మాకు కష్టమయింది. నేర్చుకోవాలన్న కసి మాలో వున్నా, నేర్పాలన్న తపన ఆయనలో వున్నా డబ్బు మమ్మల్ని ఉన్నచోటే ఆపేసింది.దాంతో అలా నా కుంగ్ ఫూ కోరిక కొండెక్కింది. ఆంధ్రా జాకీచాన్ కావాలనుకున్న నేను సైకిల్ చైన్ కూడా కాలేకపోయాను.

సరే ఏది తప్పిన చదువు తప్పదు కదా. శ్రద్ద అటు మరల్చాను. కాని మనసులో తపన అలాగే ఈరోజు వరకు ఉండిపోయింది. ఇంతలో వేసవి సెలవులు వచ్చాయి. బుర్రలో రకరకాల ఆలోచనలు. ఏదైనా చేయాలన్న తపన (పనికొచ్చేవి కాదులెండి.) అలా ఆలోచించగా జాకీచాన్ కి ఉత్తరం వ్రాయాలన్న కోరిక కలిగింది. కలిగినంత మాత్రాన అయిపోదుకదా దానిని ఆచరణలో పెట్టాలి. ఎక్కడో హాంకాంగ్ లో వున్న జాకీచాన్ కి ఉత్తరం వ్రాయాలంటే ఇంగ్లీష్ రావాలి. నాదేమో తెలుగు మీడియమాయె. తెగ ఇబ్బంది వచ్చి పడింది. కొంచెం పట్టుదల ఎక్కువ కదా దానితో బాగా ఆలోచించి ముందుగా ఏమి అనుకొన్నానో అది తెలుగులో వ్రాసాను. తర్వాత మా మామయ్య నాకు ఏడో క్లాస్ లో ఉండగా నేర్పిన ఇంగ్లీష్ పరిజ్ఞానం మరియు డిక్షనరీ సహకారంతో నా ప్రయత్నం ఆరంభించాను. రెండురోజుల అనితరసాధ్యమైన ప్రయత్నం తర్వాత నా కృషి ఫలించి ఉత్తరం సిద్దమయింది. అది చూసుకున్న నాకు చాలా ఆనందం కల్గింది.నన్ను నేనే శభాష్ అని భుజం చరుచుకున్నాను.

ఇంకా ఉంది.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: